Site icon HashtagU Telugu

Skill University MOU: తొలి రోజే కీలక ఒప్పందం.. సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంవోయూ!

Skill University MOU

Skill University MOU

Skill University MOU: ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు తొలిరోజునే విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా తెలంగాణ రైజింగ్ టీమ్ శుక్రవారం సింగపూర్లో పర్యటించింది. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు ఈ టీమ్‌లో ఉన్నారు. తొలి రోజునే తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (Skill University MOU) క్యాంపస్ నుని సందర్శించింది. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవెలప్మెంట్ కోర్సులు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించింది. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని నేరుగా కలిసి మాట్లాడారు.

అనంతరం ఐటీఈ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. హైదరాబాద్లోని ఫోర్ల్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తున్న తీరును ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు వివరించారు. నైపుణ్యాల అభివృద్ధి (స్కిల్ డెవెలప్మెంట్) శిక్షణలో పరస్పర సహకారంతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రతిపాదించారు. దీనికి ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పని చేసేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చర్చల అనంతరం నైపుణ్యాల అభివృద్ధిలో కలిసి పని చేసేందుకు ఐటీఈ, స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఈ ఒప్పందంపై యూనివర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ ప్రతినిధి బృందం తరఫున అకడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్ సంతకాలు చేశారు. ఆయనతో పాటు ఐటీఈ ఐటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ ఇందులో పాల్గొన్నారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్ను సందర్శించనుంది.

Also Read: Maruti Suzuki E Vitara: మారుతి నుంచి కొత్త కారు.. 500 కి.మీ పరిధి, 7 ఎయిర్‌బ్యాగ్‌లు!

సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శుక్రవారం ఉదయాన్నే సింగపూర్కు చేరుకుంది. తొలి రోజు పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో విస్తృత చర్చలు జరిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవనం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు. విస్తృత సహకారంతో పాటు పలు అంశాల్లో దీర్ఘకాలిక భాగస్వామ్యాలపై ముఖ్యమంత్రి ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించారు. మూడు రోజుల సింగపూర్ పర్యటన అనంతరం స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి బృందం పాల్గొంటుంది.

విమానాశ్రయంలో ప్రవాసుల సందడి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని రెండు దేశాల పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధి బృందానికి సింగపూర్లో ప్రవాసులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారంతో సింగపూర్ విమానాశ్రయంలో తెలంగాణ ప్రవాసుల సందడి నెలకొంది. వారందరూ ముఖ్యమంత్రి బృందానికి స్వాగతం పలికారు. పర్యటన విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

Exit mobile version