KTR : తెలంగాణలో కీలక ప్రాజెక్టుల భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. తాజాగా సింగూరు డ్యామ్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జూరాలకు ముప్పు, మంజీరాకు ప్రమాదం ఇప్పుడు సింగూరుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రతీరోజూ ఒక ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర ప్రాజెక్టులకు మరమ్మతులు చేస్తే తప్పులేదు అనేవారు… మేడిగడ్డ విషయంలో మాత్రం బురద జల్లడం ఎలా? అని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలో చిన్న చిన్న లోపాలను పెద్దవిగా చిత్రీకరిస్తూ, కమీషన్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
Read Also: TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు రావడం సహజం. కానీ దాన్ని రాజకీయంగా వాడుకోవడం మాత్రం దారుణం అని విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో ఇటీవలే 9వ గేట్ రోప్ తెగిపోవడం, ఇతర గేట్లకు సంబంధించి రోపులు బలహీనంగా ఉండటం తీవ్ర పరిశీలనకు గురవుతున్నాయి. అలాగే, హైదరాబాద్‌కు తాగునీరు అందించే ప్రధాన ఆధారం అయిన మంజీరా బ్యారేజీ పరిస్థితి కూడా భయంకరంగా మారిందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సింగూరు డ్యామ్ పరిస్థితి అత్యంత భయానకంగా ఉండటం తెలంగాణ ప్రజల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇవి అన్ని ప్రమాద సంకేతాలు. కానీ అధికారాలు, ప్రభుత్వాలు ఇప్పటికీ పట్టించుకోకపోవడం ప్రమాదకరం అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సింగూరు డ్యామ్‌కి కూడా అదే NDSA హెచ్చరించింది. అయినా దీనిని పట్టించుకోకపోతే, ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది. జూరాలకు, మంజీరాకు, సింగూరుకు ఒక న్యాయం చేసి… మేడిగడ్డకు మాత్రం వేరే న్యాయం అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఊరుకోరు అని ఆయన హెచ్చరించారు. ప్రతీ ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడాల్సిన అవసరం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే ప్రాజెక్టులు అనేవి ప్రాణాధారాలు. వాటిని రాజకీయ లబ్ధికోసం వదిలేయడం అప్రజాస్వామికం అని కేటీఆర్ ధ్వజమెత్తారు. తక్షణమే అన్ని ప్రాజెక్టుల పునరుద్ధరణపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేడు సింగూరు, రేపు మరేదైనా ప్రాజెక్టు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే తెలంగాణ నీటి అవసరాలు సంక్షోభంలో పడతాయి అని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వాలు ప్రాజెక్టుల భద్రతను ప్రాధాన్యతగా తీసుకోవాలని, రాజకీయ విమర్శల కన్నా ప్రజల జీవనాధారాలను కాపాడటమే ముఖ్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Read Also: HDFC : హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలకు కొత్త నిబంధనలు..ఆగస్టు 1 నుంచి అమలు..!