Half-Day Schools : తెలంగాణ రాష్ట్రంలో వేసవి వేడి సెగలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఉదయం వేళల్లో కాస్త చలిగా అనిపిస్తున్నప్పటికీ, పది గంటల తర్వాత భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8:00 గంటలకు తరగతులు మొదలై, మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపిస్తారు.
పదో తరగతి పరీక్షల దృష్ట్యా ప్రత్యేక మార్పులు కూడా చేయబడ్డాయి. పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా, అక్కడ తరగతులను మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించనున్నారు. అలాగే, పదో తరగతి విద్యార్థుల కోసం పరీక్షల సమయం ముగిసే వరకు ఉదయం పూట ప్రత్యేక తరగతులు (Special Classes) కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉర్దూ మీడియం స్కూళ్లు, డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పని చేస్తాయి.
ఈ విద్యా సంవత్సరం ముగింపు మరియు వేసవి సెలవుల షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. దాదాపు 48 రోజుల పాటు సాగే ఈ సెలవుల అనంతరం, జూన్ 12 నుంచి 2026-27 విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున, పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం మరియు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు యంత్రాంగాన్ని ఆదేశించారు.
