Site icon HashtagU Telugu

Hyderabad: మూసీ అభివృద్ధిపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన సింగపూర్ కంపెనీ

Hyderabad

Hyderabad

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అమలు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రముఖ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రముఖ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇటీవల లండన్‌, దుబాయ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టులను పరిశీలించి, దుబాయ్‌లోని పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు, డిజైన్‌, ప్లానింగ్‌, ఆర్కిటెక్చర్‌ సంస్థలు, కన్సల్టెన్సీ నిపుణులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. సమావేశాల్లో భాగంగా సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్డ్ (MEINHARDT) కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్‌లో మూసీ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై కంపెనీ అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేశారు. నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మోడల్స్‌ను రూపొందించాలని కంపెనీ ప్రతినిధులకు రేవంత్‌రెడ్డి సూచించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR), రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR), నగరం చుట్టూ రానున్న రైల్వే లైన్ల విస్తరణతో హైదరాబాద్‌ నగర రూపురేఖలు మారనున్నాయని సీఎం చెప్పారు. విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ మోడల్‌ను అభివృద్ధి చేయాలని కంపెనీలకు చెప్పారు.

సీఈవో ఒమర్ షాజాద్, సురేష్ చంద్ర నేతృత్వంలోని MEINHARDT గ్రూప్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌, హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bachchan Vs Dhankhar : పెద్దల సభలో వాగ్యుద్ధం.. జయా‌బచ్చన్ వర్సెస్ ధన్‌ఖడ్‌‌