Site icon HashtagU Telugu

2029 Assembly Elections : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్స్ – సీఎం రేవంత్

Cm Revanth Request

Cm Revanth Request

తెలంగాణ రాజకీయ వాతావరణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు విశేష చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై చేసిన జోస్యం సంచలనంగా నిలిచింది. జమిలీ ఎన్నికల అంశాన్ని ఖండిస్తూ, 2029 జూన్‌లో సాధారణ ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టంగా తెలిపారు. అంటే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా 2029లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని, తదుపరి ఐదు సంవత్సరాల పాటు — అంటే 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ే పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రేవంత్ రెడ్డి తన రాజకీయ నమ్మకాన్ని మాత్రమే కాకుండా, కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాన్ని కూడా స్ఫుటంగా తెలియజేశారు.

Minister Nimmala : కూలీలా మారిన ఏపీ మంత్రి

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ప్రజలు తెలుగు దేశం పార్టీకి, కాంగ్రెస్‌కి, అనంతరం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి చెరో దశాబ్దం పాలన ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే విధంగా ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కే 10 సంవత్సరాల అధికారాన్ని ఇస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ పది సంవత్సరాల్లో 100 సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన అభివృద్ధి బాటను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కీలకమని గుర్తుచేసి, వాటినే తమ ప్రభుత్వం మరింత విస్తరింపజేస్తుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగర అభివృద్ధిపై మాట్లాడుతూ “హైదరాబాద్ నేటి నాలెడ్జ్ సిటీగా మారడానికి కాంగ్రెస్ నాయకుల దూరదృష్టి ప్రధాన కారణం” అని వివరించారు. 2004 నుండి 2014 వరకు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలోనే జాతీయ స్థాయి సంస్థలు, ఐటీ కంపెనీలు హైదరాబాద్ వైపు దృష్టి సారించాయని తెలిపారు. జీసీసీలు, డేటా సెంటర్లు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు — ఇవన్నీ ఆ కాలంలో వేసిన పునాదుల ఫలితమేనని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలన 500 రోజుల్లో ముగుస్తుందని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “మా పాలన 1000 రోజుల పైన ఉంటుంది. కేసీఆర్ లెక్కలు అమెరికా టైమ్‌జోన్‌లో వేస్తున్నారేమో!” అని చమత్కరించారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యంగ్యం సభలో నవ్వులు పూయించడమే కాకుండా, తన రాజకీయ ధైర్యాన్ని కూడా చాటింది.

Exit mobile version