వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ : సిద్దిపేట కలెక్టర్ వ్యాఖ్యలు

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద ప్రకటనపై రైతులు, ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఒక కేజీ వరి విత్తనాలు అమ్మినా ఆ దుకాణాలను సీజ్ చేస్తానని ఆయన హెచ్చరించారు.

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 11:22 AM IST

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వివాదాస్పద ప్రకటనపై రైతులు, ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. సిద్ధిపేట జిల్లాలో ఒక కేజీ వరి విత్తనాలు అమ్మినా ఆ దుకాణాలను సీజ్ చేస్తానని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విత్తన డీలర్లను హెచ్చరిస్తూ కోర్టుల నుంచి ఆదేశాలు వచ్చినా లేదా తమపై రాజకీయ ఒత్తిడి తెచ్చినా అసలు పట్టించుకోనని…షాపులు సీజ్ చేయడం మాత్రం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. తాను ఇక్కడ కలెక్టర్గా ఉన్నంత వరకు ఆ షాపులు మూసివేసే ఉంటాయని ఆయన డీలర్లను హెచ్చరించారు. దీనికి సంబంధిచి ఎలాంటి జీవో ఉండదని..ఇది తన నోటి మాటగా చెప్పారు.జిల్లాలో ఒక్క ఎకరమైన వరి సాగు చేసినట్లు గుర్తిస్తే వ్యవసాయ విస్తరణాధికాలను సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. వరి సాగుకు వెళ్లవద్దని ప్రభుత్వం పదేపదే రైతులకు విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.సిద్దిపేట కలెక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేనప్పుడు సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు వెచ్చించి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

వరిసాగు చేయవద్దని రైతులను హెచ్చరించే హక్కు కలెక్టర్కు ఎవరు ఇచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. కలెక్టర్ తక్షణమే రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.రైతులు తాము కోరుకున్నది సాగు చేసుకునే హక్కుందని ఆయన తెలిపారు.కలెక్టర్ రైతులకు క్షమాపణ చెప్పకుంటే కలెక్టరేట్ ముట్టడికి కాంగ్రెస్ వెనుకాడబోదని హెచ్చరించారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్లా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు.

కలెక్టర్ మాటలు ప్రభుత్వ విధానమో కాదో ముఖ్యమంత్రి వెల్లడించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. రైతులను వరి పండించవద్దని చెప్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నా సాగునీటి ప్రాజెక్టుల వల్ల ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు.భారత రాజ్యాంగంపై సిద్ధిపేట కలెక్టర్కి నమ్మకం లేదని ఆరోపించారు.