Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసేకుంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన కారణంగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన ఫామ్‌పై నిప్పు పెట్టడం పట్ల కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వివరణ ఇచ్చిన వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్దమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంకేతాలు పంపుతోంది.
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు తీన్మార్ మల్లన్నపై నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల మల్లన్న ఓ బహిరంగ సభలో బీసీ కులగణన సహా పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే. బీసీ కులగణనపై తీన్మార్ మల్లన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తీన్మార్ మల్లన్న పరిధి దాటి మాట్లాడితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ఇటీవల బీసీ కులగణన, ఇతర సామాజిక అంశాలపై తీన్మార్ మల్లన్న చేసిన కొన్ని వ్యాఖ్యలు పార్టీ నేతల అసంతృప్తికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌లోని ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ పరువు దెబ్బతీసేలా మల్లన్న వ్యవహరించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ హైకమాండ్‌ను పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కులగణన రిపోర్టుపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ శ్రేణుల్ని కూడా అసంతృప్తికి గురి చేస్తోంది. తీన్మార్ మల్లన్నకు సీఎం కావాలన్న లక్ష్యం ఉంది. అందుకే తాను బీసీ కావడమే ప్లస్ పాయింట్ గా పెట్టుకున్నారని చెబుతున్నారు.ఈ క్రమంలో ఆయనను భరిస్తే కాంగ్రెస్ పార్టీకే నష్టమని అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు.. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తీన్మార్ మల్లన్న వ్యతిరేకించారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము రెడ్లకు ఉందా అని ప్రశ్నించారు. అంతకు ముందు గ్రూప్ వన్ విషయంలోనూ ప్రభుత్వాన్ని విమర్శించారు.