తెలంగాణ మద్యం బాబులకు బ్యాడ్ న్యూస్. ప్రతి ఏటా వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం బీర్ల వినియోగం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉంటుంది. అయితే, ఈసారి వేసవిలో బీర్ల కొరత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మద్యం దుకాణాల్లో సమస్య కాదు, బీర్ల తయారీకి కీలకమైన నీటి సరఫరా నిలిచిపోనుండటమే. సంగారెడ్డి జిల్లాలోని ప్రధాన బేవరేజెస్ కంపెనీలకు నీటిని అందించే సింగూరు ప్రాజెక్టులో మరమ్మత్తులు చేపట్టనుండటం ఈ సంక్షోభానికి దారితీస్తోంది.
సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే పేరుగాంచిన నాలుగు ప్రముఖ బేవరేజెస్ కంపెనీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల నుండి కేవలం తెలంగాణకే కాకుండా దేశంలోని మరో 11 రాష్ట్రాలకు బీర్లు సరఫరా అవుతాయి. ఈ బీర్ల తయారీ ప్రక్రియలో నీరు అత్యంత కీలకమైన ముడిసరుకు. సింగూరు జలమండలి నుంచి ఈ ఫ్యాక్టరీలకు ప్రతిరోజూ సుమారు 44 లక్షల లీటర్ల నీరు సరఫరా అవుతుంది. అయితే, ‘డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్’ సిఫార్సుల మేరకు సింగూరు ప్రాజెక్టు భద్రత దృష్ట్యా అందులోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి అత్యవసర మరమ్మత్తులు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల బీర్ల తయారీ కంపెనీలకు నీటి సరఫరా నిలిచిపోయి, ఉత్పత్తి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉంది.
నీటి సరఫరా నిలిచిపోతే బీర్ల ఉత్పత్తి కేవలం తగ్గడమే కాకుండా, పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేక మార్కెట్‌లో బీర్ల కొరత ఏర్పడటంతో పాటు ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కేవలం మద్యం కంపెనీలకే కాకుండా, ప్రాజెక్టును ఖాళీ చేయడం వల్ల సంగారెడ్డి పట్టణ తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నామమాత్రపు ధరకే నీటిని పొందుతూ భారీగా బీర్లను ఉత్పత్తి చేసే ఈ సంస్థలు, ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. కానీ, ఇంత భారీ మొత్తంలో నీటిని ఇతర వనరుల నుండి సేకరించడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.
