YS Sharmila : మోడీ వ‌ద్ద‌కు `కాళేశ్వ‌రం` అక్ర‌మాలు! ష‌ర్మిల భేటీ?

తెలంగాణ రాష్ట్రంలో ష‌ర్మిల రూటే స‌ప‌రేటు అన్న‌ట్టు ఉంది

  • Written By:
  • Updated On - November 11, 2022 / 12:58 PM IST

తెలంగాణ రాష్ట్రంలో ష‌ర్మిల రూటే స‌ప‌రేటు అన్న‌ట్టు ఉంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ రామ‌గుండ ప‌ర్య‌ట‌న అగ్నిగుండంగా మార్చుతామ‌ని టీఆర్ఎస్ చెబుతుంటే, ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి ష‌ర్మిల సిద్ధం అవుతున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతి గురించి మోడీకి తెలియ‌చేయడానికి ఆమె ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం లేదని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు. సొంత ఆస్తులను పెంచుకోవడానికే కేసీఆర్ పథకాలను ప్రారంభిస్తున్నారని, వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి చెప్ప‌డం ద్వారా కాళేశ్వ‌రం భాగోతాన్ని బ‌య‌ట‌కు లాగేందుకు ష‌ర్మిల సిద్ధం అయ్యారు.

ఇక తెలుగుదేశం పార్టీ తిరిగి తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభ‌వం కోసం రావ‌డాన్ని ఆమె ఆహ్వానించారు. టీడీపీ తెలంగాణ గడ్డపై పుట్టిందని, ఇక్క‌డ పూర్వవైభం తెస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ అబ్బ సొత్తా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణకు ఎవరైనా రావచ్చని, ప్రజల మనసులను గెలుచుకోవచ్చని చంద్రబాబు వ్యాఖ్యలను ఉద్దేశించి ప‌రోక్షంగా ఆమె వ్యాఖ్యానించారు.

సాధార‌ణంగా రాష్ట్రానికి ప్ర‌ధాన మంత్రి హోదాలో ఎవ‌రు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆ రాష్ట్ర సీఎం స‌మ‌స్య‌ల‌పై విన‌తి ప‌త్రాలు ఇవ్వ‌డంతో పాటు ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం గ‌త ఏడాదిన్న కాలంగా మోడీ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉంటున్నారు. ఇదే విష‌యాన్ని షర్మిల లేవ‌నెత్తుతున్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలంగాణ కు వస్తుంటే ఆయనను కలిసే దమ్ము కూడా కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నించారు. ఆయన దృష్టికి సమస్యలను తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ఒత్తిడి చేయాల్సిన ముఖ్యమంత్రి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని వ్యంగ్యాస్త్రాల‌ను సంధించారు. మొత్తం మీద రామ‌గుండం ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవ‌డానికి టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ ప్ర‌య‌త్నిస్తుంటే, ష‌ర్మిల మాత్రం కాళేశ్వ‌రం ప్రాజెక్టు అక్ర‌మాల‌ను మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.