BRS MLAs: ఎమ్మెల్యేల డర్టీ పిక్చర్.. బీఆర్ఎస్ బేజార్!

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పనితీరు, చేష్టలతో ఎన్నికల ముంగిట పార్టీకి మాయని మచ్చ తెలుస్తున్నారు.

  • Written By:
  • Updated On - June 21, 2023 / 12:58 PM IST

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ (Telangana) లో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పనితీరు, చేష్టలతో పార్టీకి మాయని మచ్చ తెలుస్తున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైంగిక ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముంగిట పలువురు ఎమ్మెల్యేలపై (BRS MLAs) లైంగిక ఆరోపణలు వినిపిస్తుండటంతో పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి కూడా తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన యాంకర్‌పై వేధింపులకు పాల్పడ్డారనే వార్తలు కూడా వినిపించాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కార్పొరేటర్ పై కన్నేసిన ఎమ్మెల్యే

తాజాగా మరో ఎమ్మెల్యే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అధికార పార్టీ బీఆర్‌ఎస్ ఇరుకున పడింది. తాజా ఘటనలో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలోని ఓ ఎమ్మెల్యే ఓ మహిళా కార్పొరేటర్‌తో అర్థరాత్రి ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే అసభ్య ఉద్దేశాలను అర్థం చేసుకున్న కార్పొరేటర్ కాల్‌ను రికార్డ్ చేసి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆ వివరాలన్నీ బయటకు వస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని అధిష్టానం కోరింది. శాసనసభ్యుడిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మహిళా కార్పొరేటర్ కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఢిల్లీకి చేరిన బెల్లంపల్లి ఎమ్మెల్యే కేసు

బెల్లంపల్లి ఎమ్మెల్యే తమను లైంగికంగా వేధిస్తున్నారని (Harassed) ఆరిజిన్ డెయిరీ డైరెక్టర్ శేజల్ లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వల్ల తమ కంపెనీలో వున్న వాళ్లంతా రోడ్డున పడ్డారని ఆరోపించారు. జాతీయ మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తొలుత ఆయనను తమ కంపెనీ బ్రాంచ్ ఓపెనింగ్‌కి పిలిచామన్నారు. అయితే తమ కంపెనీలో షేర్ అడిగారని.. దాంతోపాటు లైంగికంగా వేధించారని శేజల్ ఆరోపించారు. ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శేజల్ ఆత్మహత్యకు సైతం ప్రయత్నించడం హాట్ టాపిక్ గా మారింది.

రాజయ్యపై మళ్లీ ఆరోపణలు

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి రాజయ్యపై కూడా ఓ మహిళా సర్పంచ్‌ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారని, ఆ ఆరోపణలను ఆయన తిరస్కరించినప్పటికీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.  తాజాగా మళ్లీ ఆయనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాజయ్యపై (Rajaiah) జానకీపురం సర్పంచ్ నవ్య మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని బాండ్ రాసివ్వాలని వేధిస్తున్నాడన్నారు. 20లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. ఓ మహిళా ప్రజాప్రతినిధి తన భర్తను ట్రాప్ చేసి డబ్బులు ఆశ చూపిందని చెప్పారు. బాండ్ పేపర్లపై సంతకాలు పెట్టాలని తన భర్త ఇబ్బందులు పెడుతున్నారన్నారు. గతంలో తాను ఎమ్మెల్యే వద్ద డబ్బులు తీసుకున్నాననేది అవాస్తమని సర్పంచ్ నవ్య స్పష్టం చేశారు. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక ఆరోపణలు వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ ఏవిధంగా ముందుకెళ్తుంది, అధిష్టానం ఏవిధమైన చర్యలు తీసుకోబోతోంది? లాంటి విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి.

Also Read: Transgenders: ఇద్దరు ట్రాన్స్ జెండర్లు దారుణ హత్య, అక్రమ సంబంధమే కారణం!