HMDA Layouts : ఒక్కసారిగా జనం కలవరానికి గురయ్యారు. తమ లేఅవుట్లను బ్యాన్ చేసిన లిస్టులో చేర్చిన కొన్ని డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని చూసి ఆందోళనకు లోనయ్యారు. ఆ డాక్యుమెంట్లు నిజమైనవా ? కావా ? అనేది తేల్చుకోలేక గందరగోళానికి గురయ్యారు. దీంతో అసలు నిజమేంటో తెలుసుకునేందుకు చాలామంది భూయజమానులు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)ని ఆశ్రయించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఅవుట్ల లిస్టు గురించి అధికారులను ప్రశ్నించారు. చివరకు ఈవిషయం హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ దాకా చేరింది. దీంతో ఈ అంశంపై చర్చించి, బాధితులకు క్లారిటీ ఇచ్చేందుకు ఇవాళ హెచ్ఎండీఏ డైరెక్టర్లతో(HMDA Layouts) ఆయన సమావేశం కానున్నారు.
Also Read :Two Trains Collision: బ్రిటన్‌లో ఘోర రైలు ప్రమాదం.. ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీ!
అసలేం జరిగింది ?
- హెచ్‌ఎండీఏ ఏర్పడకముందు రంగారెడ్డి, గుర్రంగూడ, నాదర్‌గుల్, బాలాపూర్, రాగన్నగూడ, తుర్కయాంజిల్, కమ్మగూడ, మన్నెగూడ, అబ్బుల్లాపూర్‌మెట్, పెద్దఅంబర్‌పేట్, ఆదిభట్ల, మంగల్‌పల్లి తదితర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూం నడించింది.
- ఆయా ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పంచాయతీ లేఅవుట్లు వేసి భూములను విక్రయించారు.
- 2008 సంవత్సరంలో హెచ్‌ఎండీఏ ఏర్పాటైన తర్వాత ఈ లేఅవుట్లలో కొన్నింటినే రెగ్యులరైజ్ చేశారు. వీటిలో చాలావరకు బహుళ అంతస్తుల భవనాలే ఉన్నాయి.
- పైన మనం చెప్పుకున్న ఏరియాల్లో ఇంకా కొన్ని లేఅవుట్లను క్రమబద్ధీకరించలేదు. దీంతో వారు రూ.1000 చెల్లించి అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు అప్లై చేసుకున్నారు.
- ఇప్పుడు అలాంటి లేఅవుట్లే ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 2007 నంబరు 19, సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద హెచ్‌ఎండీఏ నిషేధిత లేఅవుట్ల జాబితాలో చేర్చారని తెలుస్తోంది.
- ఈ లిస్టులో చేర్చిన భూములను రిజిస్ట్రేషన్ చేయరు.
- ఎల్‌ఆర్‌ఎస్ కింద ఈ భూములను క్రమబద్ధీకరణ చేయకపోవచ్చని అంటున్నారు.
- మొత్తం మీద ఎంతోమంది భూయజమానులు.. సోషల్ మీడియాలో వచ్చిన లేఅవుట్ల నిషేధిత జాబితాను చూసి ఆందోళనకు గురైన విషయం మాత్రం వాస్తవం.