BRS Leaders House Arrest: హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్‌లతో సహా పలువురు బిఆర్‌ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై గురువారం జరిగిన దాడికి ప్రతీకారంగా ఎలాంటి హింసాకాండ జరగకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే ఎం. కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్‌లను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.
అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi) ఇంట్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అరెకపూడి గాంధీ నివాసం వెలుపల పెద్ద సంఖ్యలో మోహరించారు. కౌశిక్ రెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంబీపూర్ రాజు నేతృత్వంలోని గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ నివాసానికి వెళ్లి అక్కడ పార్టీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గాంధీ ఇంటికి చేరుకోవడానికి ర్యాలీగా బయలుదేరడానికి గులాబీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు శుక్రవారం శంబీపూర్ రాజు నివాసం వద్ద గుమిగూడడంతో, శాంతిభద్రతలను నిర్వహించడానికి పోలీసులు భద్రతను పెంచారు. అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు:
ఫిరాయించిన ఎమ్మెల్యే ఆరెకపూడి తన నివాసంపై దాడికి నిరసనగా గురువారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు కౌశిక్ రెడ్డి అడిషనల్ డీసీపీని అంతు చూస్తానని బెదిరించారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలు:
గ్రేటర్ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎన్నికైనప్పటికీ జూలైలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మార్చి నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ చేసిన న్యాయ పోరాటం చేసింది. ఈ విషయంలో హైకోర్టు బీఆర్ఎస్ పార్టీ వాదనను పరిగణలోకి తీసుకుని సమాధానం చెప్పాల్సిందిగా స్పీకర్ కు గడువు విధించింది.
Also Read: Wine Shop Close : మందుబాబులకు అలర్ట్.. ఈ తేదీల్లో వైన్‌షాపులు బంద్