Site icon HashtagU Telugu

Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

Chevella Road Accident Bala

Chevella Road Accident Bala

రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటనతో టాలీవుడ్ లో పలు సినిమా అప్డేట్స్ వాయిదా పడ్డాయి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ‘NC 24’, ‘NBK 111’ చిత్రాల నుంచి రావాల్సిన కీలక అప్డేట్లు వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. హృదయ విదారక దృశ్యాలు చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తూ, టాలీవుడ్ లో పలు కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు.

అక్కినేని నాగచైతన్య హీరోగా ‘NC 24’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ (నవంబర్ 3) మీనాక్షి క్యారక్టర్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా అప్డేట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు తెలిపారు. దురదృష్టకర సంఘటనలో బాధిత కుటుంబాలకు చిత్ర బృందం సంఘీభావం తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన విషాద సంఘటన మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి మా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఈ దురదృష్టకర సంఘటన దృష్ట్యా, మీనాక్షి చౌదరి పాత్ర పోస్టర్ విడుదలను NC24 టీం రేపటికి వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ విషాదంలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం చేకూరాలని ప్రార్థిస్తున్నాం” అని చిత్ర బృందం ప్రకటనలో పేర్కొంది.

నందమూరి బాలకృష్ణ రాబోయే సినిమా ‘NBK 111’ నుంచి కూడా ఈరోజు ఓ అప్డేట్ రావాల్సి ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం కథానాయికని అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా అప్డేట్ వాయిదా వేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

చేవెళ్ల సమీపంలో జరిగిన హృదయ విదారక సంఘటన దృష్ట్యా, ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు ఇవ్వాల్సిన అనౌన్స్ మెంట్ వాయిదా వేస్తున్నాం. బాధిత కుటుంబాలకు ‘NBK 111’ చిత్ర బృందం ప్రగాఢ సానుభూతిని, ప్రార్థనలను తెలియజేస్తోంది అని పేర్కొన్నారు. ఈ ఘటనపై సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని పవన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.

Exit mobile version