KTR: దేవుడు ఉన్నాడో లేడో తెలియదు కేటీఆర్ ఉన్నారన్న ధైర్యం

ఎవరినుంచైనా సహాయం పొందినవారికి కలిగిన ఊరట, వారి స్పందన విన్న తరువాత సహాయం చేసినవారికి కలిగే సంతృప్తే వేరు.

  • Written By:
  • Publish Date - September 25, 2022 / 01:35 PM IST

ఎవరినుంచైనా సహాయం పొందినవారికి కలిగిన ఊరట, వారి స్పందన విన్న తరువాత సహాయం చేసినవారికి కలిగే సంతృప్తే వేరు. అది అనిర్వచనీయం. అటువంటి సంతృప్తే మంత్రి కేటీఆర్ పొందారు. ఈ రోజు ట్విటర్ వేదికగా ఆయన తన సంతృప్తిని తెలియజేశారు. ‘‘ప్రజా జీవితంలో అన్నిటికన్నా తృప్తినిచ్చే సందర్భాలలో ఇలాంటి సందేశం ఒకటి’’ అని పేర్కొన్నారు. వెంకటేష్ ముదిరాజ్ అనే సోదరుడు చిట్యాల మండలం నుంచి పంపిన మెసేజ్ ఈ రోజు తనకు చాలా సంతృప్తినిచ్చినట్లు తెలిపారు. ‘‘వెంకటేష్ గారు మీ అబ్బాయి బాగున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

చిట్యాల మండలానికి చెందిన వెంకటేష్ ముదిరాజ్, లక్షి దంపతుల కుమారుడు కార్తీక్ కు ఆరోగ్య సమస్య వచ్చింది. వారు సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆస్పత్రి మేనేజ్ మెంట్ కు ఫోన్ చేసి ఆ బాబు కోలుకోవడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పారు. దాంతో కార్తీక్‌కు వైద్యం చేయడంతో అతని ఆరోగ్యం మెరుగుపడింది.సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కూడా పంపించారు. దాంతో వెంకటేష్ ముదిరాజ్ మంత్రి కేటీఆర్ కు ఒక సందేశం పంపారు.

ఆ సందేశం యథాతథంగా..‘‘మా సమస్యని ట్విటర్ లో పెట్టిన వెంటనే మీరు స్పందించారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. మీరు ఆస్పత్రి మేనేజ్ మెంట్ కు ఫోన్ చేయడం వల్ల మా బాబు ఈ రోజు చాలా మంచిగా ఉన్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మేం అప్లై చేసుకున్నాం. చెక్కు కూడా వచ్చింది. వెరీ వెరీ థ్యాంక్యూ రామన్న. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు. కానీ.. నీవు మాకు ఉన్నావని ఒక ధైర్యం.ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీకు 1000 ఏళ్ల జీవితం ఇవ్వాలని వేడుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దానికి మంత్రి కేటీఆర్ చాలా సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేశారు.