Agnipath Protest : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసంపై సీక్రెట్ రిపోర్ట్! వాళ్లు లైట్ తీసుకోవడం వల్లే..

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక అసలు కారణాలు బయటికొస్తున్నాయి. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేయడానికి వస్తున్నారన్న సమాచారం ఉన్నా.. లైట్ గా తీసుకోవడం వల్లే ఇంతటి దారుణం చోటుచేసుకుందని స్పష్టమైంది.

  • Written By:
  • Publish Date - June 25, 2022 / 02:00 PM IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక అసలు కారణాలు బయటికొస్తున్నాయి. ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేయడానికి వస్తున్నారన్న సమాచారం ఉన్నా.. లైట్ గా తీసుకోవడం వల్లే ఇంతటి దారుణం చోటుచేసుకుందని స్పష్టమైంది. ఆందోళన అంటే.. ఓ 50 మంది వస్తారులే అని అటు రైల్వే పోలీసులు, నిఘావర్గాలు భావించాయి. వాళ్లు అలా లైట్ గా తీసుకోకపోయి ఉంటే.. కచ్చితంగా ఆ దుర్ఘటనను ముందే నియంత్రించడానికి వీలయ్యేది.

అసలు ఈ ఘటన జరుగుతుందని ఇంటెలిజెన్స్ ఎందుకు ముందే పసిగట్టలేకపోయిందన్నది పోలీసు అధికారులకు అర్థం కాలేదు. అందుకే అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఓ సీక్రెట్ టీమ్ ను ఏర్పాటుచేశారు. దీంతో అసలు నిజాలు వెలుగుచూశాయి. స్టేషన్ బయట ఏం జరిగింది.. స్టేషన్ లోపల ఏం జరిగింది అన్నది ఆ టీమ్ తెలుసుకుంది. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడడంతోపాటు సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా చెక్ చేసింది. తాను సేకరించిన వివరాలతో ఇప్పటికే ఓ రిపోర్ట్ ను కూడా ఉన్నతాధికారులకు అందజేసినట్లు తెలిసింది.

అగ్నిపథ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నందున.. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలోనూ ఆందోళనలు జరగవచ్చని రైల్వే పోలీసులు ముందే అంచనా వేశారు. కాకపోతే 40 నుంచి 50 మంది ఆర్మీ అభ్యర్థులు మాత్రమే వస్తారని… అది కూడా స్టేషన్ బయటే ఆందోళన చేయవచ్చని రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో వాళ్లు కూడా ఆమేరకు అదే విషయాన్ని పోలీసులకు చెప్పారు. అందుకే ముగ్గురు హోం గార్డులు, నలుగురు కానిస్టేబుళ్లు, ఒక ఎస్సైతో సెక్యూరిటీని ఇస్తే సరిపోతుందని చెప్పినట్టుగా సమాచారం.

పోలీసులు కూడా ఈనెల 17న సెక్యూరిటీ కోసం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ఉదయం 8 గంటలకే చేరుకున్నారు. కానీ అప్పుడు ఆర్మీ అభ్యర్థులు అక్కడ కనిపించకపోవడంతో పది గంటల సమయంలో వద్దామని వెళ్లిపోయారు. కానీ అనూహ్యంగా ఆర్మీ అభ్యర్థులంతా ఉదయం 9.15 గంటలకు ఒక్కసారిగా స్టేషన్ లోకి దూసుకురావడంతో రైల్వే పోలీసులు షాకయ్యారు. వాళ్లు తేరుకునేలోపే అలా వచ్చినవారంతా విధ్వంసం సృష్టించారని.. ఆ సీక్రెట్ టీమ్ కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.