MLC Election Nominations: మెదక్- నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల (MLC Election Nominations) పరిశీలన ప్రక్రియ ముగిసింది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా 32 మంది నామినేషన్లు వివిధ కారణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌లో ఉన్న 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి.
ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 16 మంది నామినేషన్లు ఆమోదించారు. మెదక్- నిజామాబాద్- కరీంనగర్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో నిర్వహించారు.
Also Read: Chief Minister Chandrababu: ఆలయ ప్రధాన పూజారిపై దాడిని ఖండించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. అభ్యర్థులు నామినేషన్ల సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగిందని తెలిపారు. సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం నామినేషన్ తీసుకునే తేదీల్లో హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అభ్యంతరాలు కోరారు. తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలియజేసారు.