Sarpanch Attempt Suicide: నాడు రాజు.. నేడు బిచ్చగాడు.. అప్పులతో ‘సర్పంచ్’ ఆత్మహత్యాయత్నం

బంగారు తెలంగాణలో సర్పంచులు కాస్తా బిచ్చగాళ్లుగా మారుతున్నారు.

  • Written By:
  • Updated On - January 31, 2023 / 02:36 PM IST

ఒకప్పుడు సర్పంచ్ (Sarpanch) లు అంటే గ్రామానికి పెద్ద దిక్కుగా నిలిచేవాళ్లు. ఏ కష్టం వచ్చినా ఇట్టే స్పందించేవాళ్లు. తలలో నాలుకలా మెలుగుతూ ఊరి సమస్యలు, ప్రజల బాధలను తీర్చేవాళ్లు. కానీ బంగారు తెలంగాణలో సీన్ మారిపోయింది. సర్పంచులు (Sarpanch) కాస్తా బిచ్చగాళ్లుగా మారుతున్నారు. ప్రభుత్వం డబ్బులు సకాలంలో అందక, చేతిలో చిల్లి గవ్వ లేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. తెలంగాణలో రైతుల మాదరిగా సర్పంచ్ లు ఆత్మహత్యల పెరిగిపోతున్నాయంటే సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నందిపేట్ (Nandipet) సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.

ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట అంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పోలీసులు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. పెండింగ్ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురైన నందిపేట్ సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిపేట్ కు చెందిన సర్పంచ్ (Sarpanch) సాంబార్ వాణి, భర్త తిరుపతి(వార్డ్ మెంబర్) తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. రెండు కోట్ల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటి బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు.

బిచ్చగాడిగా మార్చిన అప్పులు

బీసీ కులానికి (BC Caste) చెందిన సర్పంచ్ కావడంతో గత నాలుగు సంవత్సరాల నుంచి ఉపసర్పంచ్ మాద రవి అభివృద్ధి పనుల బిల్లులపై సంతకాలు పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. సుమారు రెండు కోట్ల రూపాయలు నందిపేట్ గ్రామ అభివృద్ధి (Village Development)కి వెచ్చించానని తెలిపారు. బిల్లులు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా సహకరించడం లేదని సర్పంచ్ సాంబారు వాణి ఆవేదన చెందారు. వడ్డీలు కలిపి మూడు కోట్లకు పైగా అప్పు అయిందని అప్పుల బాధ భరించలేక కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించమని బాధితులు వాపోయారు.  ఒకప్పుడు తాము రాజులా బతికామని, సర్పంచ్ అయ్యాక బిచ్చగాడిలా మారామని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవన్ రెడ్డి పై ఆరోపణలు

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan Reddy) తనను వేధిస్తూ…. ఇబ్బంది పాలు చేస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత డబ్బు వెచ్చించామని తమ పరిస్థితి ధీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. సర్పంచ్ దంపతులు (Couple) ఆత్మహత్య ప్రయత్నం చేయడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం ఈ సమస్యను ట్వీట్ (Tweet) చేశారు.

Also Read: Nalgonda Politics: కోవర్ట్ కోమటిరెడ్డి.. నల్లగొండలో పోస్టర్ల కలకలం