హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహన రద్దీ భారీగా పెరిగింది. పండుగకు ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాల బాట పట్టారు. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు అర కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ఒక దశలో ట్రాఫిక్ కిలోమీటరు మేర నిలిచిపోయింది.
ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నప్పటికీ వాహనాలు పరిమితికి మించి రావడం,కొన్ని వాహనాల ఫాస్టాగ్‌లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు.రాచకొండ పోలీసులు, టోల్‌గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు. సంక్రాంతి నేపథ్యంలో శుక్ర, శని వారాల్లో కూడా టోల్ ప్లాజ్ వద్ద భారీగా వాహనాలు నిలిచే అవకాశాలున్నాయని ట్రాపిక్ పోలీసులు చెబుతున్నారు.