Site icon HashtagU Telugu

Tragedy : సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రసవానంతరం తల్లి, కొద్ది గంటల్లోనే శిశువు మృతి

Maternal Death

Maternal Death

Tragedy : సంగారెడ్డి జిల్లాలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రసవమైన కొద్ది నిమిషాలకే తల్లి ప్రాణాలు కోల్పోగా, గంటల వ్యవధిలోనే ఆ పుట్టిన శిశువూ మరణించటం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బాలానగర్‌లో నివసించే ఆటో డ్రైవర్‌ రాములు, లక్ష్మి దంపతుల కుమార్తె పి. అరుణ (23)కు గత సంవత్సరం సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రానాపూర్ తండాకు చెందిన శ్యామ్యుల్‌తో వివాహం జరిగింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న అరుణ గత మూడునెలలుగా తల్లిదండ్రుల వద్దే ఉండగా, శుక్రవారం ఉదయం ఆమెకు ప్రసవ వేదనలు మొదలయ్యాయి.

ఆమెను బాలానగర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అక్కడి వైద్యులు గాంధీ లేదా నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయినప్పటికీ, రాత్రి మళ్లీ నొప్పులు రావడంతో ఆశా వర్కర్లు ఆమెను మళ్లీ అదే ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం 7.50 గంటలకు అరుణ మగ శిశువుకు జన్మనిచ్చింది. నార్మల్ డెలివరీ అయినా, శిశువు ఉమ్మనీరు తాగడంతో వెంటనే నిలోఫర్‌కు తరలించారు.

అయితే, అరుణ తమ్ముడు అరవింద్‌ ఆరోగ్య కేంద్రానికి తిరిగి వచ్చేసరికి ఆమె మరణించినట్టు తెలిసింది. ఆసుపత్రి సిబ్బంది అరుణ మృతిపై సమాచారం గోప్యంగా ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన అరుణ తండ్రి రాములు, నర్సుల నిర్లక్ష్యమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శిశువు కూడా ప్రాణాలు విడిచిన విషాదకర సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌ డా. విజయనిర్మల – తమవైపు నుంచి ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని, తమ పరిధిలో ఉన్న చికిత్సను సమర్ధంగా అందించామని స్పష్టం చేశారు. కాగా, డీఎంహెచ్ఓ ప్రకారం, అరుణ మృతికి కారణం ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అని తేలినట్టు తెలిపారు. డెలివరీ అనంతరం అరుణ ఆరోగ్యంగా ఉండిందని, టిఫిన్ కూడా చేసినట్టు చెప్పారు. తల్లీబిడ్డల మృతదేహాలను మానూరు మండలం రానాపూర్ తండాకు తరలించి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గంటల వ్యవధిలో తల్లి, బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Vemulawada : కలకలం రేపుతున్న రాజన్న కోడెల మృతి..