Jaggareddy Interview : ఈ ఏడాదిలోనే పార్టీకి ద‌రిద్రం ప‌ట్టింది- జ‌గ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో అంత‌ర్గత విభేదాలు కొత్తేమీ కాదు. ప్ర‌తీ సారి ఎవ‌రో ఒకరు ఏదో ఒక విష‌యంలో అసంతృప్తికి లోన‌వ‌డం, అధిష్టానానికి ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డం చాలా కామ‌న్‌.

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 11:28 AM IST

తెలంగాణ కాంగ్రెస్‌లో అంత‌ర్గత విభేదాలు కొత్తేమీ కాదు. ప్ర‌తీ సారి ఎవ‌రో ఒకరు ఏదో ఒక విష‌యంలో అసంతృప్తికి లోన‌వ‌డం, అధిష్టానానికి ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డం చాలా కామ‌న్‌. ఈ నేప‌ధ్యంలోనే తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఇష్యూ మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. జ‌గ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నార‌ని, అతి త్వ‌ర‌లోనే టీఆరెస్‌లోకి వెళ్తున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. పార్టీలో పొస‌గ‌నివాళ్లే ఈ ప్ర‌చారం చేస్తున్నార‌ని అంటున్న జ‌గ్గారెడ్డి.. నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మై భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. త‌న నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండ‌బోతోంద‌న్న అంశంపై Hashtag Uతో ప్ర‌త్యేకంగా మాట్లాడారు జ‌గ్గారెడ్డి.

Hashtag U- రేవంత్ టీపీసీసీ అధ్య‌క్షుడు అయిన‌ప్ప‌టినుంచి అన్ని అంశాల్లో మీరు వ్య‌తిరేకిస్తున్నారు. ఇష్యూ మీకు రేవంత్‌కు మ‌ధ్య‌నా లేక పార్టీతో స‌మ‌స్య‌నా?
జ‌గ్గారెడ్డి – కాంగ్రెస్ పార్టీ మీద నాకేమీ లేదు. పార్టీ నాకు అన్నీ ఇచ్చింది. సోనియా, రాహుల్ రాజ‌కీయంగా ఏమి ఇవ్వాలో అది ఇచ్చారు. అంత‌ర్గ‌త విష‌యాలు కొన్ని ఉంటాయి. అవి స‌రిదిద్దుకునే దాంట్లో ఇబ్బంది ఉంది కాబ‌ట్టే సోనియా రాహుల్ అపాయింట్‌మెంట్ అడిగాను. రాజీనామా అనే చ‌ర్చ లేదు. వాళ్ల‌తో మాట్లాడాకే దాని మీద మాట్లాడ‌తాను. అప్ప‌టికి అంత‌ర్గ‌త లోపాలు స‌ర‌వ‌ణ అయిపోతే స‌మ‌స్య లేదు. లేక‌పోతే రాజ‌కీయంగా ఎలాంటి నిర్ణ‌యం ఏంట‌నేది చెప్తాను.

Hashtag U- కోవ‌ర్టులు అని ప్ర‌చారం ఏ వ‌ర్గం వాళ్లు చేస్తున్నార‌ని అనుకుంటున్నారు?
జ‌గ్గారెడ్డి – ఈ ద‌రిద్ర‌పు సంప్ర‌దాయం పార్టీలో మొద‌టిసారి వ‌చ్చింది. ఈ ఏడాదిలోనే ఈ దరిద్ర‌పు సంప్ర‌దాయాన్ని తీసుకువ‌చ్చే నాయ‌కులెవ‌రో చెప్ప‌లేను. అంద‌రికీ తెలిసిందే. అది వాళ్లు మానుకోవాలి. పార్టీ కూడా గ‌మ‌నించాలి. కానీ.. ఈ ద‌రిద్ర‌పు సంప్ర‌దాయం వ‌ల్ల పార్టీకే న‌ష్టం. దాన్ని కూడా స‌వ‌రించుకోవాలి.

Hashtag U- కేటీఆర్‌కు మీకు సంబంధాలు బాగున్నాయ‌ని, అందుకే నియోజ‌క‌వ‌ర్గానికి 50కోట్లు ఇచ్చార‌ని అంటున్నారు.
జ‌గ్గారెడ్డి – అదేమీ లేదు. ప్రోటోకాల్‌లో భాగంగానే అన్నీ మాట్లాడుకుంటాం. ఆయ‌న చేయాల్సింది చేశారు. అనుకునేవాళ్లు ఎన్నైనా అనుకుంటారు.

Hashtag U- భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏమిటి?
జ‌గ్గారెడ్డి – సోనియాతో మాట్లాడిన త‌ర్వాతే నిర్ణ‌యం వెల్ల‌డిస్తాను. ధాంక్స్‌!


కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి తీరును తప్పుబడతూ జగ్గారెడ్డి పార్టీ సీనియర్ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల కోరిక మేరకు, పార్టీ అధిష్టానం ఆదేశాల తన నిర్ణయం ఉంటుంది జగ్గారెడి స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశానికి జగ్గారెడ్డి హాజరై మాట్లాడారు. త్వరలో సోనియా, రాహుల్ ని కలుస్తానని, తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిని వివరిస్తానని ఆయన వెల్లడించారు. ఒకవేళ వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే తన దారి తాను చూసుకుంటానని పరోక్షంగా హెచ్చరించారు. శివరాత్రి తర్వాత తన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పర్యటిస్తానని, నా నిర్ణయాలను కాంగ్రెస్ కార్యకర్తలు వ్యతిరేకించినా తప్పు పట్టనని ఆయన అన్నారు. ఒకవేళ పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తే రాజకీయంగా పార్టీ నష్టపోతుందని, ముందే అధిష్టానానికి చెప్పానని జగ్గారెడ్డి గుర్తు చేశారు.