Grocery Kits: టీకా పుచ్చుకో.. కిరాణ కిట్ పట్టుకో!

కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - January 25, 2022 / 12:32 PM IST

కరోనా మహమ్మారి నివారణలో వ్యాక్సిన్లదే ప్రధాన పాత్ర. అందుకే ప్రభుత్వాలు, స్వచ్చంధ సంస్థలు టీకా వినియోగపైం అవగాహన కల్పిస్తున్నాయి. వాడవాడలా తిరుగుతూ వ్యాక్సిన్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొన్ని స్వచ్చంధ సంస్థలు టీకా ఇవ్వడమే కాకుండా విలువైన బహుమతులను అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో టీకా తీసుకుంటే రూ.550 విలువైన కిరాణ సామాగ్రిని ఉచితంగా తీసుకోవచ్చు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు సంగారెడ్డి జిల్లాలోని కంది గ్రామంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ‘రక్షక్ కిట్’ అని పేరుతో రూ.550 విలువైన కిరాణా కిట్‌ను అందిస్తోంది. అయితే ఇందుకు సోమవారం నుంచి కందిలోని తమ టీకా కేంద్రంలో హాజరు కావాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

సోమవారం ఒక్కరోజే అక్షయపాత్ర యాజమాన్యం 205 మందికి వ్యాక్సినేషన్‌ వేసింది. ఫిబ్రవరి 4 వరకు కిరాణా కిట్‌లతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కొనసాగించాలని ఫౌండేషన్ యోచిస్తోంది. అయితే ప్రజల స్పందనను బట్టి ఈ కార్యక్రమాన్ని మరిన్ని రోజులు పొడగించే అవకాశం ఉందని నిర్వాహకుల్లో ఒకరైన సంగప్ప చెప్పారు. పౌరులకు ఈ కిరాణా సామాగ్రిని బహుమతిగా ఇచ్చేందుకు మూడు కార్పొరేట్ కంపెనీలు అక్షయపాత్రకు నిధులు సమకూరుస్తున్నాయి.

అర్హత కలిగినవాళ్లు 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు మొదటి లేదా రెండో మోతాదు డోసులు తీసుకోవచ్చు. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు వారి గుర్తింపు కార్డుతో బూస్టర్ మోతాదు కోసం టీకా కేంద్రంలోకి వెళ్లవచ్చు. అటువంటి వ్యక్తులందరికీ కిరాణా, పరిశుభ్రత కిట్ ఇవ్వబడుతుంది. ఇందులో కేజీ నల్ల శనగలు, వేరుశెనగ, బెల్లం, ఎర్రబెల్లం, బియ్యం, ఉప్పు, పసుపు, ఎడిబుల్ ఆయిల్ ఉంటాయి. వాటితో పాటు ప్యాక్‌లో సబ్బు, శానిటైజర్ బాటిల్ ఉంటుంది. టీకా కేంద్రం అన్ని పని దినాలలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది.