Sandhya Theater incident: గతేడాది డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. కాగా.. మంగళవారం ఆస్పత్రి నుంచి శ్రీతేజ్‌ను డిశ్చార్జ్ చేశారు. అతన్ని ప్రస్తుతం రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించారు. అక్కడ 15 రోజుల పాటు ఉంచి ఫిజియోథెరఫీ వంటివి నిర్వహించాక ఇంటికి తీసుకెళ్లొచ్చని వైద్యులు సూచించినట్లు సమాచారం.
గత పదిహేను రోజుల క్రితం ఐసీయూ నుంచి శ్రీతేజ్ ను వైద్యులు రూమ్‌కి షిఫ్ట్ చేశారు. బాబు ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇన్ఫెక్షన్లు లేకుండా నిలకడగా ఉందని, రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించాలని వైద్యులు సూచించారని, అక్కడ పదిహేను రోజులు ట్రీట్మెంట్ తరువాత ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్పారని బాలుడు తండ్రి తెలిపారు. ప్రస్తుతం శ్రీతేజ్ కళ్లు తెరిచి చూస్తున్నాడు. ద్రవాహారం మాత్రమే పైపు ద్వారా పంపిస్తున్నారు. బ్రెయిన్ ఇంకా రికవరీ కాలేదు.. మమ్మల్ని గుర్తు పట్టడంలేదు. ఆస్పత్రిలో ఎన్ని రోజులు ఉన్నా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని.. రిహాబిలిటేషన్‌కు తీసుకెళ్తే కొంత మెరుగుపడొచ్చని వైద్యులు సూచించారు. ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని బాలుడు తండ్రి తెలిపాడు.
అసలేం జరిగిందంటే..
గతేడాది డిసెంబర్ 4వ తేదీన “పుష్ప-2: ది రూల్” సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన జరిగింది. ఈ ఘటనలో 35ఏళ్ల మహిళ రేవతి మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఎనిమిదేళ్ల బాలుడు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయింది. సినిమా హీరో అల్లు అర్జున్ సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. డిసెంబర్ 13న అల్లు అర్జున్ ను తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి న్యాయస్థానం అల్లు అర్జున్‌కు రిమాండ్ విధించగా.. పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అదేరోజు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. కానీ, సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10.30 గంటలకు అందడంతో అర్జున్‌ను ఆరోజు రాత్రి చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు. మరుసటి రోజే డిసెంబర్ 14న అల్లు అర్జున్ చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు.