ఎన్ కౌంట‌రా? ఆత్మ‌హ‌త్యా? రంగంలోకి సివిల్, రైల్వే పోలీస్

  • Written By:
  • Publish Date - September 16, 2021 / 05:11 PM IST

ప్ర‌జా, మ‌హిళా సంఘాల ఒత్తిడి, రాజ‌కీయ డ్రామాల న‌డుమ సైదాబాద్ ఘోరానికి తెలంగాణ పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు. నిందితుడు రాజు మృతదేహాన్ని ఘన్‌పూర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో స్థానికులు గుర్తించారు. చేతికి ఉన్న టాటూను గుర్తించిన పోలీసులు రాజుగా నిర్థారించారు. దీంతో తెలంగాణ పోలీసుల‌కు స‌వాల్ గా నిలిచిన రాజు ప‌రారీ వ్య‌వ‌హారం రైలు ప‌ట్టాల మీద ముగిసింది.
ఇంత‌కూ రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? ఎవ‌రైనా చంపేసి అక్క‌డ ప‌డేశారా? ట్వీట్ తొల‌గించ‌డం అనుమానాలు ఊపందుకున్నాయి. పోలీసులు అదుపులో రాజు ఉన్నాడ‌ని కేటీఆర్ నాలుగు రోజుల క్రితం ట్వీట్ చేయ‌డం ఆ త‌రువాత రెండు రోజుల క్రితం ట్వీట్ ను తొల‌గించ‌డం వెనుక ఏం జ‌రిగింది? ప‌ట్టిస్తే 10ల‌క్ష‌లు న‌జ‌రానా పోలీసులు ప్ర‌క‌టించ‌డం..వీట‌న్నింటికీ గ‌మ‌నిస్తే రాజు మృతిపై ప‌లు అనుమానాలు రేకెత్త‌డం స‌హ‌జం.
రాజు మృత‌దేహం మీద ఉన్న గాయాలను గ‌మ‌నిస్తే ఎవ‌రైనా కొట్టి చంపారా? కుంగిపోయి పోలీసులు ఎన్ కౌంట‌ర్ చేస్తార‌ని భ‌య‌ప‌డి రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా..అనే అనుమానాల‌కు తావిస్తోంది. రాజు మృత‌దేహం ల‌భించ‌న ప్ర‌దేశం రైల్వే ప‌రిధిలోకి వ‌స్తుంది. తెలంగాణ పోలీసుల‌తో పాటు రైల్వే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. రైల్వే ట్రాక్ ల‌పై చ‌నిపోయిన వాళ్ల‌కు సంబంధించి సెంట్ర‌ల్ రైల్వే ఫోర్స్ విచార‌ణ చేయాలి. ఇప్పుడు ఈ కేసును తెలంగాణ పోలీసులు విచారించాలా లేక రైల్వే పోలీసులా అనే సందిగ్ధం కూడా నెల‌కొంది. కేంద్రం ప‌రిధిలోని రైల్వే శాఖ‌కు ఈ కేసు వెళితే, విచార‌ణ మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం తెలంగాణ పోలీసులు రాజు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని అన్ని కోణాల నుంచి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ త‌రువాత కేసును రైల్వే పోలీసులకు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రాజు మృతి ఎన్ కౌంట‌రా లేక ఆత్మ‌హ‌త్యా అనేది తేల‌డం చాలా క‌ష్టం.


పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి ఉండొచ్చనే అనుమానాలు సైతం లేక‌పోలేదు. కానీ, ఎన్‌కౌంటర్ చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరూ నిర్దారించట్లేదు. ఆత్మహత్య చేసుకోవడానికే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సమాజానికి, పోలీసులకు భయపడి అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.
వైద్యులకు అందించేందుకు డీఎన్ఏ శాంపిళ్లను సేకరించారు పోలీసులు. సైంటిఫిక్ వెరిఫికేషన్ కోసం ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి శాంపిళ్ల‌ను పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తరువాత- ఆ మృతేహం నిందితుడు రాజుదా? కాదా? అనే తుది నిర్ధారణ చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు.


సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, అనంతరం హత్యకు పాల్పడిన రాజును గాలించడానికి పోలీసులు 10 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 1000 మంది పోలీసులతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్లగొండ, సూర్యాపేట్, వరంగల్ వంటి జిల్లాల్లో విస్తృతంగా గాలించారు. ప్రతి ఒక్క డిపార్ట్‌మెంట్‌నూ అప్రమత్తం చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లను పోలీసులు అలర్ట్ చేశారు. అతి పెద్ద మ్యాన్ హంట్‌గా గుర్తింపు పొందింది. ఆటోల వెనుక, ఆర్టీసీ బస్సుల్లో అతని ఫొటోలను అతికించారు.
సైదాబాద్ సింగరేణి కాలనీ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలను సృష్టించింది. బాధిత కుటుంబాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. నైతికంగా అండగా నిలిచారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, నటుడు మంచు మనోజ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వీరంతా ఆ చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు.