ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ప్రారంభించిన రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసికి (LIC)ప్రీమియం చెల్లిస్తూ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. పథకం ప్రారంభించిన తొలి ఏడాది 2018-19లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకోగా, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగింది.
2018 లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే, నేడు రూ. 1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తోంది. ఇప్పటి వరకు రైతుల తరుపున ప్రభుత్వం రూ. 6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించింది. గుంట భూమి ఉన్నా చాలు, రైతుగా గుర్తించి, ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదు. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్ కృతజ్ఞతలు అంటూ బీఆర్ఎస్ మంత్రులు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరుగాలం శ్రమించే అన్నదాతల జీవితాలకు భరోసా లేదు. పొలం పనుల్లో నిత్యం బిజీగా ఉండే రైతుకు బీమా సౌకర్యం గగనం. పంట ఉత్పత్తిపైనే ఆధారపడి జీవించే కర్షకులకు బీమా సౌకర్యం అన్నది కొద్ది మందికే ఎరుక. అలాంటి జీవిత బీమాను రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల దరికి చేర్చింది. సీఎం కేసీఆర్ వినూత్న ఆలోచనలో భాగంగా తీసుకు వచ్చిన రైతుబీమా పథకం విజయవంతంగా అమలవుతున్నది. రైతుకు అకాల మరణం సంభవిస్తే అతడిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. లబ్ధిదారుని వాటా కింద పైసా తీసుకోకుండా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబానికి నిర్ణీత కాల వ్యవధిలోనే ఎల్‌ఐసీ ద్వారా బీమా సొమ్ము అందించే విధంగా ఏర్పాట్లు చేశారు. సన్న, చిన్నకారు రైతు కుటుంబాలకు బీమా సౌకర్యం ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతున్నది.
Also Read: Sanjay Dutt Injured: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు గాయం, అయినా శరవేగంగా షూటింగ్