Site icon HashtagU Telugu

Rythu Bharosa : ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా అమలు చేయాలి – కేటీఆర్

Rythu Bharosa

Rythu Bharosa

తెలంగాణ అసెంబ్లీ (TG Assembly) సమావేశాలు ఈరోజు ఏడో రోజు కూడా వాడివేడిగా కొనసాగుతున్నాయి. ముందుగా వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల రైతు భ‌రోసా(Rythu Bharosa)పై స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ ప్రారంభించారు. రైతు భ‌రోసా విధివిధానాల‌పై సూచ‌న‌లు ఇవ్వాల‌ని స‌భ్యుల‌ను కోరారు. సంక్రాంతి పండుగ నాటికి రైతు భ‌రోసాపై విధివిధానాల‌ను ఖ‌రారు చేసి, ఆ త‌ర్వాత రైతు భ‌రోసా చెల్లింపులు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సందర్బంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ..ఎన్నికల్లో రైతులకు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేసారు. అధికారంలోకి రాగానే రైతు భరోసా ఇస్తాం, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పి..ఈరోజు పూర్తిస్థాయిలో ఏది చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్ పై విరుచుకపడ్డారు. రైతులు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇలా అందరికి రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది..చెప్పినట్లే రైతుభరోసా అమలు చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేసారు. రైతు భరోసాను భారంగా చూడొద్దన్నారు. బాధ్యతగా చూడాలన్నారు.

గ‌త ప్ర‌భుత్వం రైతు బంధు ప్రారంభించి రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జ‌మ అయ్యాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మేం ఒక ద‌ఫా మాత్ర‌మే చెల్లించామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు చెప్ప‌డం అభినంద‌నీయం. రైతుబంధు రూ. 21,283 కోట్ల దుర్వినియోగం జ‌రిగింద‌ని మంత్రి తుమ్మ‌ల చెప్పారు. 2019-20లో సాగు విస్తీర్ణం 141 ల‌క్ష‌ల ఎక‌రాల‌ని మంత్రే చెప్పారు. 2020-21లో సాగు విస్తీర్ణం 204 ల‌క్ష‌ల ఎక‌రాలు అని మీరు ఇచ్చిన నివేదికలో ఉంది. రైతుబంధు ఇవ్వ‌డం వ‌ల్లే సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎక‌రాల‌కు పెరిగింది. ఇక మంత్రి తుమ్మ‌ల‌ ఆర్వోఎఫ్ఆర్ భూముల‌ గురించి ప్ర‌స్తావించారు. నాలుగున్న‌ర ల‌క్ష‌ల గిరిజ‌న బిడ్డ‌ల‌కు పోడు ప‌ట్టాలు ఇచ్చిన ఘ‌న‌త కేసీఆర్‌ది. ఆర్వోఎఫ్ఆర్ ప‌ట్టాల‌ కింద ఉన్న భూముల్లో ఒక పంట మాత్ర‌మే సాగు చేసే అవ‌కాశం ఉంటుంది. మేజ‌ర్ కాల్వ‌లు ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా క‌ష్టంతో సాగు చేస్తారు. ఈ గిరిజ‌న బిడ్డ‌లకు రెండో విడుత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వ‌రా..? స‌మాధానం చెప్పాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read Also : Narendra Modi : కువైట్‌లో ప్రధాని మోదీ మొదటి రోజు పర్యటన..!