తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రైతులకు అండగా తీసుకొచ్చిన రైతు భరోసా (Rythu Bharosa) పథకంపై తాజా నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. రైతు భరోసా పథకానికి సంబంధించి తప్పనిసరిగా 7 నుంచి 10 ఎకరాల వరకు పరిమితి పెట్టాలని రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు వల్ల చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే మద్దతు అందించవచ్చని కమిటీ అభిప్రాయపడింది.
రైతు భరోసాపై సబ్ కమిటీ చేపట్టిన అభిప్రాయ సేకరణలో చాలఎకరాలు కలిగిన రైతులకు ఈ పథకం అందించడం అనవసరం అని సూచించారు. దీనికి తోడు ప్రజాప్రతినిధులు, IAS, IPS అధికారులకు రైతు భరోసా ప్రయోజనం కల్పించవద్దని స్పష్టం చేశారు. వ్యవసాయం చేసేవారికి మాత్రమే ఈ పథకం ఉపయోగపడాలని సూచించారు. రైతు భరోసా పథకం కింద ప్రతి వ్యవసాయ సీజన్‌కు ఎకరాకు రూ. 7,500 సాయాన్ని అందించనున్నారు. ఈ మొత్తంతో పంట సాగు, ఎరువులు, విత్తనాల కొనుగోలుకు రైతులు సౌకర్యవంతంగా వ్యవహరించవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే, ఈ సాయాన్ని చాల ఎకరాల కలిగిన వారితోపాటు భూమి ఉన్న ప్రజాప్రతినిధులు పొందడంపై విమర్శలు వస్తున్నాయి.
ఈ అంశంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సబ్ కమిటీ సిఫార్సులపై అసెంబ్లీలో చర్చించి, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. రైతు భరోసా పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా పథకం లక్ష్యం చిన్న, సన్నకారు రైతుల పరిస్థితిని మెరుగుపరచడమే. ఎకరాల పరిమితిని నిర్దేశించడం ద్వారా ఈ పథకం తగినవారికి మాత్రమే అందుతుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయాలు వాస్తవంలో ఏ విధంగా అమలవుతాయో చూడాల్సి ఉంది.
Read Also : Hyderabad Metro Phase-II: MGBS-చాంద్రాయణగుట్ట మార్గంలో భూసేకరణ వేగవంతం