రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు.

Published By: HashtagU Telugu Desk
Rythu Bharosa

Rythu Bharosa

Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారని సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, నిరాధారమైనవని, లబ్ధిదారులను తప్పుదోవ పట్టించే దురుద్దేశంతో కూడుకున్నవని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం ఆపడం లేదు. నిలిపివేసే ఆలోచన కూడా లేదు. ప్రస్తుతం కేవలం నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఆర్థిక సహాయం అందేలా చూడటానికి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోంది. ఆర్థిక శాఖ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, చెల్లింపుల కోసం తనిఖీలను నిర్వహిస్తోందని పేర్కొంది.

Also Read: చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!

శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా పారదర్శకత

వాణిజ్య వినియోగంలో ఉన్న భూములను గుర్తించి, అనర్హులను జాబితా నుండి తొలగించేందుకు ప్రభుత్వం జర్మన్ టెక్నాలజీ సహాయంతో ‘శాటిలైట్ మ్యాపింగ్’ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్య అంశాలు ఇవే..!

  • ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ మ్యాపింగ్ జరుగుతోంది.
  • 2024 గ్రౌండ్ సర్వే ప్రకారం హైదరాబాద్ పరిసరాలు, ORR, RRR పరిధిలో సుమారు 4 లక్షల ఎకరాల భూమి వాణిజ్య వినియోగంలో ఉందని తేలింది.
  • రైతు భరోసా పొందుతున్న భూమి నిజంగా సాగులో ఉందా లేక రియల్ ఎస్టేట్ వెంచరా, కొండలా లేదా ఫామ్ హౌస్ లా అన్నది ఈ సాంకేతికత ద్వారా నిర్ధారిస్తారు.
  • వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతున్న భూములు ఈ పథకానికి అర్హత కలిగి ఉండవు.

అర్హతలు- ప్రయోజనాలు

  1. ప్రభుత్వం ఈ పథకంపై ఎలాంటి కొత్త షరతులు విధించలేదు.
  2. అర్హులైన లబ్ధిదారులందరికీ రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ. 12,000 అందజేయబడుతుంది.
  3. ఒక రైతు రబీ లేదా ఖరీఫ్ కాలాలలో పంట పండించవచ్చు. ఒక సీజన్‌లో ఒకే పంట పండించినా ఆర్థిక సహాయం అందుతుంది.
  4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత ఏడాది 90 రోజుల పంపిణీ ప్రక్రియను కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు.

అభ్యంతరాల కోసం సంప్రదించండి

ఒకవేళ జాబితా నుండి పేర్లు తొలగించబడి, అభ్యంతరాలు ఉన్న రైతులు తగిన వివరణ కోసం జిల్లా కలెక్టర్ లేదా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చని ప్రభుత్వం సూచించింది. నిజమైన లబ్ధిదారులు ఎవరూ నష్టపోకూడదని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. కాబట్టి ప్రజలు అసత్య వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని కోరడమైనది.

  Last Updated: 26 Dec 2025, 08:29 PM IST