CM KCR : గుబులు పడకండి.. డిసెంబర్ 6న రైతుబంధు డబ్బులు వేస్తాం.. రైతులకు సీఎం కేసీఆర్ హామీ

రైతు బంధు డబ్బులు రైతులకు పడకుండా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయించి బ్రేక్ వేయించిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Publish Date - November 28, 2023 / 07:32 AM IST

CM KCR : రైతు బంధు డబ్బులు రైతులకు పడకుండా కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయించి బ్రేక్ వేయించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయమే రైతు బంధు డబ్బులు వస్తాయని రైతులు కూడా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు కానీ.. తెలంగాణ రైతులకు ఈసీ షాక్ ఇచ్చింది. రైతు బంధు నిధులు విడుదల చేయకూడదని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో రైతు బంధు డబ్బులు రైతులకు వేయడం ప్రభుత్వం వేయకుండా ఆపేసింది. దీంతో తెలంగాణ రైతులు కొంచెం గుబులు పడ్డారు. పెట్టుబడి సాయంగా రైతు బంధు డబ్బులు వస్తాయని ఆశపడి భంగపడ్డారు. మళ్లీ ఎప్పుడు వేస్తారో.. ఏ ప్రభుత్వం వస్తుందో.. అసలు ఇస్తారో ఇవ్వరో అని టెన్షన్ పడుతున్న తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు.

రైతు బంధు డబ్బుల విషయంలో గుబులు పడకండి. డబ్బులు పడలేదని టెన్షన్ పడకండి. డిసెంబర్ 3న బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రాగానే డిసెంబర్ 6నే రైతు బంధు డబ్బులను మీ ఖాతాల్లోకి వచ్చేట్టుగా చేస్తానని సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హామీ ఇచ్చారు.

రైతుల నోటి దగ్గరి బువ్వను కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎగరగొట్టారు. కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకుంది. రైతు బంధు ఇస్తుంటే వాటిని ఆపేందుకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రైతులను ఆదుకోవడానికి అహర్నిశలు మేము కష్టపడుతుంటే.. రైతులకు మేలు జరగకూడదని కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఇలాంటి వాటి వల్ల నా మనసుకు బాధ కలుగుతుంది. అయినా మీరేం టెన్షన్ పడకండి. అధికారంలోకి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే మీ అకౌంట్లలో రైతు బంధు డబ్బులు పడతాయని రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.