ప్ర‌గ‌తి భ‌వ‌న్‌,రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య ఆర్టీఐ యాక్ట్..త‌మిళ సైని న‌మ్ముకున్న ఎఫ్‌జీజీ

  • Written By:
  • Publish Date - October 22, 2021 / 04:43 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వానికి, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య స‌మాచార హ‌క్కు వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌వ‌ర్న‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత త‌మిళ సై కొన్ని సంద‌ర్భాల్లో నేరుగా వివిధ విభాగాల అధికారుల‌తో స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. యూనివ‌ర్సిటీల ఉప కుల‌ప‌తుల‌తో భేటీ అయ్యారు. విద్య‌, వైద్య రంగాల‌పై గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. గిరిజ‌న ప్రాంతాల‌కు నేరుగా వెళ్లి వాళ్ల‌తో మ‌మేకం కావ‌డం కూడా ప్ర‌భుత్వం పెద్ద‌లు జీర్ణించ‌కోలేక‌పోయారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు, రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని కొంద‌రు అప్ప‌ట్లో భావించారు.

కాల‌క్ర‌మంలో రెండు భ‌వ‌న్ ల న‌డుమ సంఖ్య‌త క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వానికి అవస‌ర‌మైన డైరెక్ష‌న్ ఇస్తూ తెలంగాణ పెద్ద‌గా త‌మిళ సై ఉంటున్నారు. అదే విధంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా త‌మిళ సై కి ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఇస్తూ పాల‌న సాగిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎలా ఉండాలో తూ.చ త‌ప్ప‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం న‌డుచుకుంటోంది. అయితే, ఇటీవ‌ల స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి సంబంధించిన ఒక జీవో ప్ర‌గ‌తి భ‌వ‌న్, రాజ్ భ‌వ‌న్ మ‌ధ్య చ‌ర్చ‌నీయాంశం అయింది. స‌మాచారం హ‌క్కు చ‌ట్టంపై తెలంగాణ ప్ర‌భుత్వం ఆక్ష‌ల‌ను పెట్టింది. ఇక నుంచి ప్ర‌జా స‌మాచార‌సంబంధాల‌ అధికారులు నేరుగా స‌మాచారాన్ని ఇవ్వ‌డానికి లేకుండా చేసింది. తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన అధికారి ఒక జీవోను అక్టోబ‌ర్ 13న జారీ చేసింది. దాని ప్ర‌కారం సంబంధిత విభాగాల ముఖ్య కార్య‌ద‌ర్శ‌లు, విభాగాల అధిప‌తులు మాత్రమే స‌మాచారం ఇవ్వాలి. నేరుగా స‌మాచారాన్ని పీఐవోలు ఇవ్వ‌డానికి లేదు. అంటే, ఆర్టీఐ యాక్ట్ ప్ర‌కారం వివ‌రాల కోసం సంబంధిత శాఖ చీఫ్ సెక్ర‌ట‌రీలు, ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ, హెడ్ లకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఆ జీవోను అధ్యయ‌నం చేసిన త‌రువాత చీఫ్ సెక్ర‌ట‌రీ జారీ చేసిన జోవో స‌మాచారం హ‌క్కు చ‌ట్టంలోని సెక్ష‌న్ 7(1)కు వ్య‌తిరేకంగా ఉంద‌ని పీపుప‌ల్స్ ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ కార్య‌ద‌ర్శి ప‌ద్మ‌నాభ‌రెడ్డి భావిస్తున్నారు. ఆ జీవో ప్ర‌కారం 30 రోజుల్లో స‌మాచారం ఇవ్వ‌డం చాలా క‌ష్టం. సంబంధిత శాఖ‌ల హెడ్ ల వ‌ద్ద‌కు వెళ్లి మారుమూల గ్రామాల ప్ర‌జ‌లు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం క‌ష్టం. ఇదంతా పాలనా ప‌ర‌మైన అంశాల‌ను దాచిపెట్టే య‌త్నమంటూ ఎఫ్‌జీజీ భావిస్తుంది. అందుకే, ఆ జీవోను ర‌ద్దు చేయ‌డానికి గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకోవాల‌ని ఆ సంస్థ కోరుతోంది. ఆ క్ర‌మంలో ఆర్టీఐ చ‌ట్టం, ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో పైన రాజ్ భ‌వ‌న్ సీరియ‌స్ గా ప‌రిశీలిస్తోంది. రాబోవు రోజుల్లో ఎలాంటి నిర్ణ‌యం రాజ్ భ‌వ‌న్ నుంచి రాబోతుందో చూడాలి.