Medaram: మేడారం భక్తులకు TSRTC గుడ్ న్యూస్, ఇంటి వద్దకే ప్రసాదం

  • Written By:
  • Updated On - February 16, 2024 / 11:23 PM IST

Medaram: ఆసియాలోనే అతి పెద్ద జాతరగా గుర్తింపు పొందిన ఈ వేడుకను చూసి తరించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివస్తారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని… నిలువెత్తు బంగారం సమర్పించుకుంటారు. దాదాపు కోటి మంది వరకు ఈ జారతకు హాజరవుతారు. కానీ… కొన్ని కారణాల కారణంగా… జాతరకు వెళ్లలేని వారు ఎంతో మంది. జాతరను కళ్లారా చూడలేకపోయినా… అమ్మవార్ల మహా ప్రసాదం అయితే దక్కితే చాలనుకునే వారు చాలా మంది ఉంటారు. ఇలాంటి వారి కోసం శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. జాతరకు వెళ్లలేకపోయిన వారికి కూడా మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసింది టీఎస్‌ఆర్టీసీ . ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే చాలు.. మేడారం జాతర ప్రసాదాన్ని మీ ఇంటి ముందుకే తెచ్చిస్తామంటోంది.

ఇందు కోసం దేవాదాయ శాఖతో టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దేవస్థానం నుంచి అమ్మవార్ల ప్రసాదంతో పాటు పసుపు, కుంకుమను భక్తుల ఇళ్ల దగ్గరకే అందజేయనుంది టీఎస్‌ఆర్టీసీ. ఇందు కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ కూడా ప్రారంభించింది. ఈనెల 21 నుంచి 24 వరకు మేడారం జాతర జరగనుంది. దీంతో నిన్నటి నుంచే ప్రసాదం బుకింగ్‌ చేసుకునే అవకాశన్ని భక్తులకు కల్పించింది టీఎస్‌ఆర్టీసీ. ఈనెల 25 వరకు ప్రసాదం బుకింగ్‌ సేవలు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్‌లో గానీ.. ఆఫ్‌లైన్‌లో గాని.. ప్రసాదాన్ని బుక్‌చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్‌లో అయితే… టీఎస్ఆర్టీసీ కార్గో కౌంటర్లలో గానీ… పీసీసీ ఏజెంట్ల దగ్గర గానీ.. రూ.299 చెల్లించి మేడారం ప్రసాదాన్ని బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ అయితే… https://rb.gy/q5rj68 లింక్‌పై క్లిక్‌ చేయాలి. లాదే… పేటీఎం ఇన్‌ సైడర్‌ యాప్‌లోనూ అమ్మవార్ల ప్రసాదాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ప్రసాదం బుకింగ్‌ సదుపాయం తెలంగాణలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మేడారం జాతర అయిపోయిన తర్వాత… బుక్‌ చేసుకున్న వారి ఇంటికే ప్రసాదాన్ని అందజేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు.