RS Praveen Kumar : బీఎస్పీకి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరే ఛాన్స్ ?

RS Praveen Kumar : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పార్టీని వీడారు.

  • Written By:
  • Updated On - March 16, 2024 / 02:53 PM IST

RS Praveen Kumar : బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పార్టీని వీడారు. ఈవిషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడటం తప్ప మరో అవకాశం తనకు లేకుండాపోయిందని ప్రవీణ్ పేర్కొన్నారు.  తెలంగాణలో భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఇక బీఎస్పీదే అన్నారు. ‘‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలను పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.ఇక బీఎస్పీకి రాజీనామా చేసిన తరువాత ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరుతారని అంచనా వేస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ఉదయం ట్విట్టర్ వేదికగా స్పందించారు.  ఈ ట్వీట్‌లో కవితకు మద్దతుగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు రాజకీయ కుట్రలో భాగమన్నారు.  మోడీ ప్రభుత్వం ఈడీని అడ్డంపెట్టుకొని కల్వకుంట్ల కవిత గారిని వేధిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈవిధంగా విపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ అరెస్టును తాము బీఎస్పీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గలేదు. విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీతో ఎన్నికల పొత్తుకు కేసీఆర్ సమ్మతించలేదు. బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీతో బీఆర్ఎస్ చేతులు కలిపిన కొన్ని గంటల్లోనే మోడీ బ్లాక్‌మెయిల్ పాలిటిక్స్‌కు తెర తీశారు’’ అని ఆరోపించారు. ‘‘ఈడీ చర్యలు ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు.