Site icon HashtagU Telugu

Chinnajeeyar Row : జీయర్ ‘కుల’గడబిడ

Chinnajeeyar Ramanuja

Chinnajeeyar Ramanuja

అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు విగ్రహాన్ని ప్రారంభించే వేళ చినజీయర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఏ కులం వాళ్ళు ఆ కులం పనే చేయాలని ఆయన చేసిన ప్రవచనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాదు , ‘పంది మాంసం తింటే పంది లా, కోడి మాంసం తింటే కోడిలా ..ఏ జంతువు తింటే ఆ జంతువులా వ్యవహరిస్తారని సంచలన ప్రసంగం చేసాడు. ఆ వీడియో ప్రసంగాలను విన్న సామాజిక వాదులు మండిపడుతున్నారు. మధ్యయుగం నాటి మాటలు జీయర్ మాట్లాడుతున్నాడని తెలంగాణ సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఫైర్ అయ్యాడు. ఇలాంటి కుల వ్యతిరేకులు ఆహ్వానించే రమానుజాచార్యుల విగ్రహం ప్రారంభానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి కొవింద్ రాకూడదని హితవు పలికాడు. ఇంకో వైపు తెలంగాణ పీసీసీ చీఫ్ చిన జీయర్ ను టార్గెట్ చేసాడు. కేవలం వైష్ణవులకు మాత్రమే ఆహ్వానాలు ఇస్తున్నాడని ఎత్తిపొడిచాడు. కాంగ్రెస్ నేతలను శైవులుగా జీయర్ భావించి ఉండొచ్చని సెటైర్ వేసాడు. ఈ వీడియోలు అన్ని ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆయన చేసిన వివాదాస్పద ప్రసంగాలను బయటకు తీస్తున్నారు. సమానత్వం కోసం పోరాడిన మహానుభావుని విగ్రహ ప్రారంభాన్ని విజయవంతం చేయాలని దేశవిదేశీలకు ఆహ్వానాలు పంపుతున్న వేళ సోషల్ మీడియా వేదికగా జీయర్ నెటీజన్లకు టార్గెట్ గా మారాడు. సామాజిక చైతన్య ప్రభోదకులైన రామానుజుల అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందని జీయర్ భావిస్తున్నాడు.

ప్రపంచం వివక్ష, కుల, మత, లింగ, ఆర్థికపరమైన అసనమాతలవైపు వెళుతున్న సమయంలో సమతా భావన పెంపొందాల్సిన అవసరం ఉందని తిదండి చిన్నజీయర్ స్వామి ఈ విగ్రహం ఏర్పాటుకు పూనుకున్నాడు. తీవ్రవాదం ద్వారా పైచేయి సాధించాలన్న భావన పెరుగుతున్న ఇలాంటి సమయంలో సమతామూర్తి విగ్రహం ద్వారా సమ భావనను అందరిలోకి తీసుకెళ్లడానికి ఇది ఒక ప్రయత్నం. దీనితో వివక్ష, అసమానతలకు సరైన పరిష్కారం దొరుకుతుందని ఆయన భావన.ప్రతి ఒక్కరిలో సమతా భావనను రగిలిస్తే రాబోయే తరాలు సమాజంలో సమభావన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోగలుతారని చిన్నజీయర్ స్వామి ఆలోచన. 1017వ సంవత్సరంలో జన్మించిన రామానుజాచార్య.. 120 ఏళ్లపాటు జీవించారు. భారతదేశమంతటా పర్యటించారు. విశ్వమంతా ఒకే కుటుంబంలా ఉండాలంటూ ప్రభోదించారు. పంచం నలుమూలల నుంచి అన్ని వర్గాల వారు చేతులు కలిపినప్పుడే శ్రీరామానుజాచార్యుల సమతా భావన సాధ్యమవుతుందని చిన్నజీయర్‌స్వామి భావన. భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.

Sri Ramanujacharya Statue

శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని ఉన్న విగ్రహ రూపాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్దది. 200 ఎకరాల్లో వేయి కోట్లతో ఈ రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా ఏర్పాటు చేస్తోన్న 216 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. దీని కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ గా రామనుజాచార్యులు విగ్రహాన్ని ప్రపంచానికి చూపుతున్న సమయంలో కుల, ఆహార, శైవ అంశాలు జీయర్ ను చుట్టుముట్టాయి. సామాజిక, రాజకీయ వేత్తలు జీయర్ ప్రసంగాలపై మండిపడుతున్నారు. విగ్రహ ఆవిష్కరణ రోజు జీయర్ వాలకాన్ని నిరసించాలని ప్రయత్నం జరుగుతుంది. సో..ఆ రోజుకు జీయర్ ఎలా స్పందిస్తారో..చూద్దాం.