Kavitha Bail: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సోమవారం కోర్టు నుంచి షాక్ తగిలింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఆగస్టు7 కు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ కావేరి భవేజా తెలిపారు. అంతకుముందు సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం ఆయన ప్రయత్నించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ రెండు కేసుల్లో ప్రస్తుతం ఆమెపై చార్జిషీట్ దాఖలైంది. ఈ క్రమంలో బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టుకు వెళ్లారు. అక్కడ కూడా కవితకు నిరాశే ఎదురైంది. తిరిగి ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇకపోతే ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్న కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు ఢిల్లీ వెళ్లారు. జైలులో ఈ రోజు ఆమెను కలవనున్నారు ఈ మాజీ మంత్రులు. అటు ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ఇదే జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈ ముగ్గురు కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ, సీబీఐ ఆరోపిస్తుంది. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ బలమైన ఆధారాలను చూపెడుతుంది.
Also Read: Rameshwaram Cafe Blast: ఇద్దరు నిందితులను విచారించిన ఎన్‌ఐఏ