Site icon HashtagU Telugu

Robbery Case : వ‌న‌స్థ‌లిపురం దోపిడీ కేసులో న‌లుగురు అరెస్ట్‌.. రూ.18ల‌క్ష‌లు స్వాధీనం

Crime

Crime

హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దోపిడీ కేసులో న‌లుగురు నిందితుల్ని రాచ‌కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.18 లక్షల నగదు, మెర్సిడెస్ బెంజ్ కారు, యమహా ఫ్యాసినో బైక్, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తల్లాబ్‌కట్టా నివాసి మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ అలియాస్‌ నయీమ్‌ (32), యాకుత్‌పురాకు చెందిన జాఫర్‌ పహెల్వాన్‌ కుమారుడు ఒమర్‌ బిన్‌ హమ్జా అల్‌ జాబ్రీ (30), జాఫర్‌ పహెల్వాన్‌ కుమారుడు అలీ బిన్‌ హంజా అల్‌ జాబ్రీ అలియాస్‌ అలీ (27)గా గుర్తించారు. యాకుత్‌పురా నివాసి అలీ జా కోట్లాకు చెందిన ఫహాద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అలియాస్ ఫహద్, రహీం గౌరీ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

అబ్దుల్‌ హమీద్‌.. వెంకట్‌రెడ్డి అనే వ్య‌క్తి నుంచి రూ.50 లక్షల రుణం తిసుకున్నాడ‌ని.. వాటిని హ‌మీద్ తిరిగి చెల్లించ‌క‌పోవ‌డంతో వెంక‌ట్ రెడ్డి అత‌నిపై ఒత్తిడి తెచ్చాడని పోలీసులు తెలిపారు. అయితే అ డ‌బ్బును వెంక‌ట్‌రెడ్డి ద‌గ్గ‌రే కొట్టేసి అత‌నికే చెల్లించాల‌ని ప్లాన్ వేశాడని రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ తెలిపారు. జనవరి 6న వెంకట్‌రెడ్డి మద్యం దుకాణం నుంచి నగదును తీసుకెళ్తుండగా హమీద్, ఒమర్, అలీ బిన్ హంజా, ఫహద్‌లు అతడిని ఆపి అతని నుంచి రూ.25 లక్షలు లాక్కెళ్లారు. అనంతరం అందరు ఆ మొత్తాన్ని పంచుకున్నారని క‌మిష‌న‌ర్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.18 లక్షల నగదు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ ప్రవీణ్‌తో కలిసి వెంకట్‌రెడ్డి హవాలా వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతని ఇంట్లో భారీగా నగదు స్వాధీనం చేసుకోవడంతో విచారణలో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుందని పోలీసులు తెలిపారు.