Site icon HashtagU Telugu

KCR Modi : నువ్వు అటు నేను ఇటు.!

KCR and Modi

KCR and Modi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌ధ్య మ‌రోసారి ప్రొటోకాల్ వ్య‌వ‌హారం తెర‌మీద‌కు వ‌చ్చింది. అధికారిక ప్రోగ్రామ్ లో భాగంగా మోడీ హైద‌రాబాద్ వ‌చ్చిన టైంలో కేసీఆర్ క‌ర్ణాట‌క వెళ్ల‌డం విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. గ‌త ఏడాది కాలంగా వాళ్లిద్ద‌రి మ‌ధ్యా ఇలాంటి వ్య‌వ‌హారం న‌డుస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ ప‌రిశీల‌న కోసం భార‌త్ బ‌యోటెక్ ను ప్ర‌ధాని మోడీ గ‌త ఏడాది ప‌రిశీలించారు. ఆ సంద‌ర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స‌మ‌తామూర్తి రామానుజాచార్యుల విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన మోడీకి మొఖం చాటేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌.

ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం నుంచి వ‌చ్చిన సంకేతాల కార‌ణంగా భార‌త్ బ‌యోటెక్‌, రామానుజాచార్యుల విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు వ‌చ్చిన మోడీ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్ దూరంగా ఉన్నార‌ని ఒకానొక ఇంట‌ర్వ్యూలో కేటీఆర్ వెల్ల‌డించారు. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉండాలని వ‌చ్చిన సూచ‌న‌ల మేర‌కు మాత్రం కేసీఆర్ మొఖం చాటేశార‌ని ఎత్తిపొడిచారు. కానీ, మంత్రి కేటీఆర్ మాటల్లో నిజంలేద‌ని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం అధికారిక వివ‌ర‌ణ ఇచ్చింది. ప్రొటోకాల్ ప్ర‌కారం రాష్ట్రానికి పీఎం వ‌స్తే ఆయా రాష్ట్రాల సీఎంలు ఆహ్వానిస్తారు. ఆ విధంగానే గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ ముందు వ‌ర‌కు తెలంగాణ‌లోనూ జ‌రిగింది. కానీ, త‌ద్విరుద్ధంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

కేంద్రం రాజ్యాంగం ప‌ద‌విలో నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ను కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌ట్టించుకోవ‌డంలేదు. ప్రొటోకాల్ ప్ర‌కారం ఇవ్వాల్సిన విలువ ఆమెకు ఇవ్వ‌డంలేదు. ఆ విష‌యాన్ని ప్ర‌ధాన మంత్రి, రాష్ట్ర‌ప‌తి, కేంద్ర హోంశాఖ మంత్రికి త‌మిళ సై ఫిర్యాదు కూడా చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న వైఖ‌రిలో ఏ మాత్రం మార్పు క‌నిపించ‌లేదు. పైగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌స్తున్న షెడ్యూల్ ను తెలుసుకుని ఉద్దేశ పూర్వ‌కంగా బెంగుళూరు టూర్ కేసీఆర్ పెట్టుకున్నార‌ని బీజేపీ ఆరోపిస్తోంది.

జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామిలతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయంలో దిగనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు విమానాశ్రయ పార్కింగ్‌లో రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. 1.50 నిమిషాల్లో హెలికాప్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి గచ్చిబౌలి ఐఎస్‌బీకి వెళ్లాలి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య జరిగే ISB వార్షికోత్సవానికి హాజరవుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు బేగంపేట నుంచి చెన్నైకి బయలుదేరుతారు.

తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ వస్తుంటే.. సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్తున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో మాజీ ప్రధాని దేవెగౌడ భేటీ కానున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి లీలా ప్యాలెస్ హోటల్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు.