Site icon HashtagU Telugu

KCR Vs Tamilisai : రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందా?

tamilisai and cm kcr

tamilisai and kcr

తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు గవర్నర్ తమిళసై ఆహ్వానించినా ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లలేదు. మంత్రులు రాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సిన అధికారులు కూడా వెళ్లలేదు. అంటే గవర్నర్ కు, సీఎంకు మధ్య ఉన్న విభేదాలు పెరిగాయా? అక్కడికీ గవర్నర్.. అన్నీ మర్చిపోదాం.. కలిసి పనిచేద్దాం అని చెప్పినా కేసీఆర్ ముందడుగు వేయడం లేదా? అసలు ఏం జరుగుతోంది?

రాజ్ భవన్ లో జరిగిన ఉగాది ఉత్సవాలకు సీఎం హాజరుకాకపోవడంతో రాజకీయ పరిణామాలు మారుతున్నట్టే కనిపిస్తోంది. ప్రగతి భవన్ లో జరిగిన ఉత్సవాలకైతే గవర్నర్ కు ఆహ్వానం అందనట్టే ఉంది. పిలిస్తే వెళతాను అని ఆమె స్వయంగా అన్నా సరే.. పిలుపందనట్టే ఉంది. గవర్నర్.. తనకు రాజ్ భవన్ లిమిట్స్ తెలుసని.. తనకు ఇగో లేదని అంత ఓపెన్ గా చెప్పినాసరే.. ప్రగతి భవన్ ఎందుకు స్పందించడం లేదు?

కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్ విషయంలో గవర్నర్ వెంటనే ఆమోద ముద్ర వేయలేదు. దాదాపుగా అప్పటి నుంచి ముఖ్యమంత్రికి, గవర్నర్ కు మధ్య దూరం, వైరం పెరుగుతూ వస్తోంది. తరువాత సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా గవర్నర్ కు ప్రభుత్వం హెలికాప్టర్ ను సమకూర్చలేదు. అయినా అక్కడికి వెళ్లిన గవర్నర్ ను ఆహ్వానించడానికి కలెక్టర్ కాని, ఎస్పీ కాని రాకపోవడం కూడా చర్చనీయాంశమైంది.

గవర్నర్ కూడా తనకు తన పరిమితులు తెలుసంటూనే.. అధికారాలు కూడా తెలుసని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇక ఉగాది వేడుకల్లో బ్యాక్ డ్రాప్ బ్యానర్ లో సీఎం కేసీఆర్ ఫోటో లేకపోవడం కూడా వివాదంగా మారింది. అందులో ప్రధాని మోదీ ఫోటో ఉన్నప్పుడు సీఎంగా కేసీఆర్ ఫోటో కూడా ఉండాల్సిందే అన్న వాదనుంది.

రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని గవర్నర్ అన్నారు. అందులో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖలకే పంపిస్తామనీ చెప్పారు. నిజానికి ఇలాంటివాటికి సమస్య ఉండదు. కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే.. ఇది రాజకీయంగా వివాదంగా మారింది. రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు ఇలాంటి ప్రజాదర్బార్ ల వల్ల ఏమీ కాదు. కానీ ఇప్పుడున్న వాతావరణంలో ఇలాంటి చర్యల వల్ల సమస్యలు తప్పవంటున్నారు విశ్లేషకులు.

రాజ్ భవన్ నుంచి రాజకీయ సంకేతాలు వస్తున్నంతకాలం.. ప్రగతి భవన్ నుంచి కూడా రాజకీయ సంకేతాలు వస్తూనే ఉంటాయని అర్థమవుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.