Site icon HashtagU Telugu

Minister Instructions: కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణపై సమీక్ష.. మంత్రి కీల‌క సూచ‌న‌లు!

Minister Instructions

Minister Instructions

Minister Instructions: కరోనా వైరస్ వ్యాప్తి, సీజనల్ డిసీజ్‌ల నివారణ, నియంత్రణపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Instructions) సమీక్ష చేశారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఫణీంద్ర రెడ్డి, డీఎంఈ నరేంద్రకుమార్, డీహెచ్ రవిందర్ నాయక్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు, ఎపిడమాలజిస్టులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇండియా, ఇతర దేశాల్లో ఉన్న కోవిడ్ పరిస్థితులను అధికారులు, ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు స్పల్పంగా పెరిగినప్పటికి హాస్పిటలైజేషన్ చాలా తక్కువగా ఉందన్నారు‌. ఇండియాలో పరిస్థితి నార్మల్‌గా ఉందని, జేఎన్‌.1 వేరియంట్ కేసులు కొన్ని నమోదయ్యాయని.. ఈ వేరియంట్ 2023 నుంచే ఇండియాలో వ్యాప్తిలో ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులేమీ లేవన్నారు. ఇతర దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారికి తప్పితే, ఇతరులెవరికీ హాస్పిటలైజేషన్ అవసరం పడడం లేదన్నారు.

కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి రాష్ట్రాలకు ఇప్పటివరకూ అడ్వైజరీలు, గైడ్‌లైన్స్ ఏమీ రాలేదు అని అధికారులు తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉండడం, ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. సుమారు 3 సంవత్సరాల క్రితమే కోవిడ్ ఎండెమిక్ స్టేజ్‌లోకి వచ్చిందని, అప్పుడప్పుడు కేసులు నమోదు అవడం, తగ్గడం, పెరగడం సహజమేనని ఎపిడమాలజిస్టులు మంత్రికి వివరించారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరాలు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుందన్నారు.

Also Read: Slot Booking: తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూన్ 2 నుంచి స్లాట్ బుకింగ్‌!

రాష్ట్రంలో అక్కడక్కడ నమోదయ్యే కోవిడ్ కేసులను మేనేజ్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని అధికారులు మంత్రికి తెలిపారు. టెస్టింగ్ కిట్స్‌, మెడిసిన్ సహా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉండాలన్నారు. కరోనా, సీజనల్ డిసీజ్‌ల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

కోవిడ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు మంత్రి సూచించారు. వర్షాకాలంలో సీజనల్ డిసీజ్‌ల భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జలుబు, దగ్గులాగే కోవిడ్ కూడా ఒకరి నుంచి‌ ఒకరికి వ్యాపిస్తుందని.. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దగ్గు, జలుబు ఉన్నప్పుడు మాస్కు ధరించడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వైరస్‌లు వ్యాపించకుండా ఉంటాయన్నారు. ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీటి నిల్వ ఉంటే దోమలు పెరిగి, వ్యాధులు వ్యాపించే ప్రమాదముంటుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల నివారణ, నియంత్రణపై పంచాయతీరాజ్, మునిసిపల్, ఇతర శాఖలతో కలిసి పని చేయాలన్నారు. అన్ని హాస్పిటళ్లలో సరిపడా మెడిసిన్, ఇతర రీఏజెంట్స్‌ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కోవిడ్, డెంగీ పేరిట ప్రజలను ఆందోళనకు గురిచేసి, దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.