Telangana Liquor Sale: తెలంగాణలో కిక్కు తగ్గిందా? మరి ఆదాయం ఎలా పెరిగింది?

తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిన ఎఫెక్ట్ అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 02:53 PM IST

తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచిన ఎఫెక్ట్ అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. లిక్కర్ వినియోగం తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం మాత్రం బాగా పెరిగింది. అసలే అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి సమయంలో లిక్కర్ ధరలు కూడా పెరగడంతో కుటుంబాల్లో దానిపై పెట్టే వ్యయం తగ్గిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం బీర్లు, మద్యం ధరలను 20 రూపాయిల నుంచి 160 రూపాయిల వరకు పెంచేసింది. దీంతో ఒక్కో బ్రాండ్ రేటు ఒక్కోలా మారిపోయింది. పైగా ధరలను పెంచడానికి ముందురోజు.. అమ్మకాలను కూడా ఆపేశారు. కొత్త ధరలను ప్రకటించిన తరువాతే మళ్లీ సేల్స్ స్టార్ట్ అయ్యాయి.

వేసవి వేడి ఎంత ఎక్కువగా ఉంటే.. అంతలా బీర్ల అమ్మకాలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు ఎండ చండప్రచండంగా ఉన్నా సరే.. గత వారం బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి. హైదరాబాద్, మేడ్చల్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో పరిస్థితి ఇలాగే ఉంది. లిక్కర్ అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో మద్యం అమ్మకాలు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో జరుగుతాయి. ఇక్కడ ధరలు పెరిగిన తరువాత దాదాపు 20వేల కేసుల మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి.
ఇదే జిల్లా పరిధిలో ఈనెల 19 నుంచి 28 వరకు 3.6 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గతంతో పోలిస్తే దాదాపు 40 వేల కేసుల అమ్మకాలు
తగ్గాయి.

లిక్కర్ ధరలు పెరగడం వల్ల సేల్స్ పడిపోయిన మాట వాస్తవమే కాని.. ఆ మేరకు ఆదాయం పెరిగింది. ఎందుకంటే గ్రేటర్ లోని మూడు జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17వ తేదీ వరకు రూ.315 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ 19 నుంచి 28వ తేదీ వరకు రూ.351 కోట్ల రూపాయిల ఆదాయం వచ్చింది. దీంతో తరువాతి రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందా అని లిక్కర్ షాపు యజమానులు ఆలోచిస్తున్నారు.