Site icon HashtagU Telugu

Jubilee Hills Bypoll Result : ఫలించిన రేవంత్ వ్యూహాలు

Cm Revanth Jubli

Cm Revanth Jubli

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయానికి సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన వ్యూహాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓటర్లు విజయం–పరాజయాలను నిర్ణయించే స్థాయి ప్రభావం కలిగి ఉన్నారని ముందుగానే విశ్లేషించిన రేవంత్, వారి మనసులు గెలుచుకునేందుకు ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని అమలు చేశారు. ముఖ్యంగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందే అజహరుద్దీన్‌ను మంత్రిగా నియమించడం ద్వారా మైనారిటీ వర్గాలకు ప్రభుత్వ అనుభంధతను తెలియజేస్తూ, వారికి కాంగ్రెస్‌పై విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశారు. ఈ నిర్ణయం మైనారిటీల ఓటింగ్ ప్రవర్తనపై నేరుగా ప్రభావం చూపిందని విశ్లేషకుల అభిప్రాయం.

Jubilee Hills Byelection Counting : 20 వేలు దాటిన కాంగ్రెస్ మెజార్టీ

ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి నేలమీదకే దిగి గల్లీ నుంచి గల్లీకి రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించడమే కాకుండా, స్థానిక సమస్యలను నేరుగా వినడంలో ఆసక్తి కనబర్చారు. ఈ రీతిలో ఒక సీఎంగా స్వయంగా ప్రచారభూమిలోకి దిగడం, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని బలపరిచింది. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడడం, రేవంత్ శైలిలో ఉన్న ఆత్మీయత, తెగింపు, దూకుడు—అన్నీ కలిసి కాంగ్రెస్‌కు అదనపు మద్దతు తెచ్చిన అంశాలుగా నిలిచాయి. ఆయన ప్రచార శైలి ప్రత్యర్థి పార్టీల ప్రచారాన్ని మరుగునపరచి, ఎన్నికల వాతావరణాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించింది.

అత్యంత కీలకమైన నిర్ణయం నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం. స్థానికంగా గట్టి పట్టు, శక్తివంతమైన క్యాడర్, ప్రతి బూత్‌కు చేరే వ్యవస్థ ఇప్పటికే ఉన్న నాయకుడిగా నవీన్ యాదవ్ బలానికి హైకమాండ్‌ను నమ్మించడం అంత సులభం కాదు. అయితే రేవంత్ తన వాదనను స్పష్టంగా చూపించి, నియోజకవర్గం గత ఓటింగ్ నమూనాలు, సామాజిక సమీకరణాలను హైకమాండ్ ముందు వివరించి నవీన్‌కు టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ నిర్ణయం చివరికి సరైనదిగా తేలి, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలక భూమిక పోషించింది. ఇటీవల సాధించిన విజయం రేవంత్ నాయకత్వానికి మరొకసారి ముద్ర వేసినట్లైంది.

Exit mobile version