తెలంగాణ తల్లి విగ్రహ (Telangana Talli Statue) మార్పు ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సాహితీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) సాధించిన విజయాలను, నిర్మాణాలను తక్కువ చేసి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ (CM Revanth).. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చడం చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు.
“సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ల కథలే చరిత్రగా నిలుస్తాయి” అనే ప్రసిద్ధ పల్లవిని ఉటంకించారు. కేసీఆర్ హయాంలో ఏర్పడిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటి మౌలిక వసతుల గురించి రేవంత్ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో నిర్మితమైన తెలంగాణ తల్లి విగ్రహం 2007లో ఉద్యమకారులతో కలిసి రూపొందించబడిందని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరికానికి చిహ్నంగా ప్రతిష్టించాలన్న ఆలోచనను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. “భారతమాత విగ్రహాన్ని వాజపేయీ సవరించలేదు, అలాగే తెలుగు తల్లి విగ్రహం కూడా మారలేదు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రజా అభిప్రాయాలకు విరుద్ధంగా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.
అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని, చరిత్రను చెరిపేయాలని ప్రయత్నించడం ప్రమాదకరమని కేటీఆర్ అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడం వలన తీవ్ర ప్రతికూలత ఎదురవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని పునర్విమర్శించి వెనక్కి తగ్గాలని సూచించారు.
Read Also : CM Chandrababu : రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు