Site icon HashtagU Telugu

Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!

Revanth Reddy

Revanth Reddy

సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించి భద్రాద్రి ఆలయాన్ని విస్మరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భద్రాద్రి ప్రతిపాదనను చేపడతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా 100 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక్కొక్కటి రూ.10 కోట్లతో శ్రీరాముని ఆలయాలు నిర్మించాలని నిర్ణయించారు. ఆలయ పట్టణంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో ఎనిమిదో రోజు ‘హాత్‌ సే హాత్‌ జోడో’ యాత్రనుద్దేశించి రేవంత్‌రెడ్డి (Revanth Reddy)  మాట్లాడుతూ నిజాంలతో పాటు గత పాలకుల హాయంలో భద్రాద్రి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మండిపడ్డారు.

చంద్రశేఖర్ రావు (CM KCR) నేతృత్వంలోని టీఆర్‌ఎస్ (ప్రస్తుతం బీఆర్‌ఎస్) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించడాన్ని సీఎం నిలిపివేశారు. అంతేకాకుండా ఆలయ పట్టణ అభివృద్ధికి రూ.100 కోట్లు, వరద నియంత్రణకు రూ.1000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకాలేదు. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేయడమే కాకుండా రాముడిని కూడా మోసం చేశారు” అని అన్నారు. యాత్రలో రేవంత్ పినపాక, సారపాక రెండు ప్రాంతాల రైతులతో ముచ్చటించారు. సీతారామ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తెలంగాణలో బీజేపీకి (BJP) స్థానం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రూ.5 లక్షలు, వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. వీటితో పాటు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను క్లియర్ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ కవర్‌ను ప్రస్తుత రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ చీఫ్‌ వి.హనుమంతరావు, ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి తదితరులు భద్రాచలంలోకి రేవంత్‌ రెడ్డి వెంట ఉన్నారు. విభజన తర్వాత ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారని, అదే సమయంలో తెలంగాణ రెండు లక్షల ఎకరాలను కోల్పోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండింటినీ ఓడించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు శ్రమించాల్సిన సమయం ఆసన్నమైందని హనుమంతరావు స్పష్టం చేశారు.

Also Read: Rashmika Role: పుష్ప2లో రష్మిక పాత్ర తగ్గిందా.. సెట్స్ లో అడుగుపెట్టని శ్రీవల్లి!