తెలంగాణ రాష్ట్రంలో కుల గణన (Caste Census) చుట్టూ రాజకీయ పరస్పర విమర్శలు అల్లుకున్నాయి. మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) తమ ప్రభుత్వ సర్వేను తప్పుపట్టడాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ) తీవ్రంగా ఖండించారు. గతంలో కేసీఆర్ 12 గంటల్లో సర్వే నిర్వహించి ప్రజల సమాచారాన్ని సేకరించారని, కానీ ఇప్పుడు తమ కుల గణన లెక్కలపై తప్పుబడటాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. ఈ గణన ప్రక్రియలో ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో నిరూపించాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
రాష్ట్రంలో బీసీల జనాభా గురించి స్పష్టత లేకుండా తాము పాలన చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ హయాంలో బీసీల సంఖ్య 51 శాతంగా లెక్కించగా, తమ కుల గణనలో 56 శాతంగా తేలిందని రేవంత్ వివరించారు. అయితే ఈ గణన ప్రక్రియలో ముస్లింలను బీసీలలో చేర్చారని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు చేయడం గమనార్హం. దీనిపై స్పందించిన సీఎం దూదేకుల సహా 28 ముస్లిం జాతులకు బీసీ రిజర్వేషన్లు ఎప్పటి నుంచో అమలులో ఉన్నాయని స్పష్టం చేశారు.
తెలంగాణలో కుల గణన రాజకీయ వాదనలకు కేంద్ర బిందువుగా మారింది. ఓవైపు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో గణన చేపట్టిందని చెబుతుండగా, ప్రతిపక్షాలు దీనిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాయని విమర్శిస్తున్నాయి. కేసీఆర్ సర్కార్ పాలనలో బీసీలకు సరైన ప్రాధాన్యం దక్కలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారికోసం ప్రత్యేకంగా కుల గణన చేపట్టిందని సీఎం రేవంత్ వివరించారు. కుల గణన ప్రక్రియ పట్ల పారదర్శకత పాటించి ప్రజలకు నిజమైన గణాంకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.