తెలంగాణలోని పేదలకు రేవంత్ సర్కార్ (Congress Govt) తీపి కబురు అందించింది. రేషన్ కార్డు లబ్ధిదారులకు (Ration Card Beneficiaries) సన్నబియ్యం పంపిణీ(Distribution of Superfine Rice) చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీ అంగన్‌వాడీ సెంటర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే జరుగుతోంది. కానీ తర్వలో పేద ప్రజలకు కూడా పూర్తిగా సన్నబియ్యం మంజూరు చేయాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ పంపిణీ రేషన్ డీలర్ల ద్వారా జరగనుంది. తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల నుంచి సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి, గోదాముల్లో నిల్వ ఉంచి మిల్లింగ్ చేయించనున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఈ సంవత్సరం 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సన్న బియ్యాన్ని పేదలకు నెలకు 2 లక్షల టన్నుల చొప్పున పంపిణీ చేస్తుంది. ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే, సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.500 బోనస్ కూడా చెల్లిస్తున్నట్లు వివరించారు.
అంతే కాదు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరగబోతుందన్నారు. కొంతకాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండుగ మొదలు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించారు. దాదాపు 30 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిర్ణయాలు తెలంగాణలోని పేదలకు కీలకమైన సహాయాన్ని అందించే విధంగా ఉంటాయని అంచనా వేయవచ్చు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల పంపిణీ తదితర చర్యలు పేద ప్రజల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలుగా చెప్పవచ్చు.
Read Also : Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!