Electricity Consumers: రానున్న వేసవిలో రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ప్రజా భవన్‌లో ఎన్పీడీసీఎల్, ట్రాన్స్‌కో అధికారులతో రానున్న వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికాలపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రానున్న వేసవిలో విద్యుత్ అంతరాయం అనే మాట తలెత్తకుండా వినియోగదారులకు (Electricity Consumers) నాణ్యమైన విద్యుత్ ను నిరాటంకంగా సరఫరా చేయాలని ఆదేశించారు.
వేసవి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా సీఎండీలు మొదలు ఎస్ఈల వరకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా సమీక్ష, అవగాహన సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ సమావేశాలలో వినియోగధారులను, మీడియా ప్రతినిధిలను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. గత వేసవిలో ఎదురైన ఇబ్బందులు, వాటిని అధిగమిస్తూ రానున్న వేసవిలో సమర్థవంతంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఈ సమావేశాల్లో వివరించాలని ఆదేశించారు. ఉన్నత అధికారులు క్షేత్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ను వెనువెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.
Also Read: HMDA Land Auction : హెచ్‌ఎండీఏ భూముల వేలం..ఈసారి సామాన్యులకు..!!
108 తరహాలోనే విద్యుత్ సరఫరాలో సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటు చేసిన 1912ను విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. 1912కు వచ్చిన ఫిర్యాదులను వెనువెంటనే పరిష్కరించాలని, ఈ వ్యవస్థ నిర్వాహణ ప్రచారానికి అదనపు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్పీడీసిఎల్ పరిధిలో వచ్చే మార్చిలో పీక్ డిమాండ్ 6328 మెగా వాట్ల విద్యుత్ సరఫరా చేయడానిలకి కావాలసిన అన్నీ చర్యలు ముందస్తుగా తీసుకోవాలని ఆదేశించారు.
వేసవిలో వినియోగాన్ని ధృష్టిలో పెట్టుకుని పీక్ డిమాండ్ ను తట్టుకునే విధంగా ట్రాన్స్ మిషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. సబ్ స్టేషన్ల వారీగా ఓవర్ లోడ్ సమస్యలను గుర్తించి ముందుగానే వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకవేళ ఈదురు గాలుల వలన విద్యుత్ అంతరాయం ఏర్పడితే ERT (ఎమర్జెన్సీ రీస్టోర్ టీం) వాహనాలను వాడుతున్నారని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ప్రతీ ఒక్కరూ అహర్నిశలు కష్టపడుతున్నారని ట్రాన్స్కో, ఎన్పీడీసిఎల్ అధికారులను అభినందించారు.ఈ సమీక్ష సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ డీ. కృష్ణ భాస్కర్, ఎన్పీడీసిఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ట్రాన్స్‌కో, ఎన్పీడీసిఎల్ డైరెక్టర్లు, ఇతర ముఖ్య ఉన్నత అధికారులు పాల్గొన్నారు.