Site icon HashtagU Telugu

Indiramma Sarees Scheme : తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది..!

Indiramma Sarees

Indiramma Sarees

తెలంగాణ ప్రభుత్వం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ చీరల’ పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు అందించే ఈ పథకం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు.

తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాలన బలహీన వర్గాలకు సువర్ణ అధ్యాయమని, ఆమె పరిపాలన ఒక మోడల్ అని కొనియాడారు.

ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో ‘ప్రజాపాలన’ అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతోనే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ జయంతి రోజు అయిన నేడు ప్రారంభించి డిసెంబర్ 9 వరకు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 వరకు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.

చీరల ఉత్పత్తికి సమయం పడుతున్న నేపథ్యంలో మొదటి విడతలో 65 లక్షల చీరలు పంపిణీ చేస్తామని మొత్తం కోటి చీరలను రెండు విడతలుగా అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇందిరమ్మ చీర కట్టుకొని ఆడబిడ్డల ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని ఆయన పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వంలో మహిళా సాధికారతకు, ఆర్థిక ఉన్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేసిందని విమర్శిస్తూ.. తమ ప్రభుత్వం మొదటి విడతగా రూ. 22,500 కోట్ల వ్యయంతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని ప్రకటించారు.

మహిళలకు పెట్రోల్ బంకులు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలనే యజమానులను చేశామని తెలిపారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరా గాంధీ భూ సంస్కరణలతో పేదలకు భూపంపిణీ చేశారని.. ప్రపంచ దేశాల బెదిరింపులకు భయపడకుండా పాకిస్తాన్‌ను విడగొట్టి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారని సీఎం గుర్తు చేశారు. రాజకీయాల్లోనూ మహిళలకు తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని ఆయన అన్నారు.

Exit mobile version