Revanth Sentiment: రేవంత్ మును‘గోడు’ సెంటిమెంట్.. కార్యకర్తలకు బహిరంగ లేఖ!

మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ స్వయంగా ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గర

  • Written By:
  • Publish Date - October 26, 2022 / 11:03 AM IST

మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ స్వయంగా ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో మరింత కసి పెరిగినట్లు కనిపిస్తోంది.టిఆర్ఎస్, బిజెపిలకు తమ సత్తా ఏంటో చూపించాలని కాంగ్రెస్ శ్రేణులు ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. మొదటి నుంచి రేవంత్ ను వ్యతిరేకిస్తూ వస్తున్న వెంకటరెడ్డి విషయాన్ని అందరూ తేలిగ్గా తీసుకున్నా.ఆయన స్వయంగా పార్టీ ఓటమిని కోరుకుంటున్నారు అనే విషయం బయటపడిన దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ నాయకులలో మరింత పట్టుదల కనిపిస్తోంది.

ముఖ్యంగా ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.దీనిలో భాగంగానే ఈ నియోజకవర్గంలో సెంటిమెంట్ రగిలించే పనిలో రేవంత్ నిమగ్నం అయ్యారు.ఈ మేరకు పార్టీ శ్రేణులకు రేవంత్ బహిరంగ లేఖ రాశారు.కాంగ్రెస్ శ్రేణులంతా మునుగోడుకు తరలిరావాలని కాంగ్రెస్ ను అంతం చేయాలని బిజెపి టిఆర్ఎస్ లు కుట్ర చేస్తున్నాయని , దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్ ను ఓడించాలి అనుకుంటున్నాయి అంటూ మండపడ్డారు. సి ఆర్ పి ఎస్, ఎలక్షన్ కమిషన్ లను బిజెపి దుర్వినియోగం చేస్తుందని, రాష్ట్ర పోలీసులు స్థానిక అధికారులను టిఆర్ఎస్ విచ్చలవిడిగా వినియోగించుకుంటుందని రేవంత్ మండపడ్డారు.అలాగే యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ట అంటూ రేవంత్ విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలను దించిందని,రాష్ట్ర ప్రభుత్వం పోలీసు,ఇంటలిజెన్స్,టాస్క్ ఫోర్స్ అధికారులను అడ్డుపెట్టుకొని డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. తన బలం,బలగం,కుటుంబం అంతా కాంగ్రెస్ కార్యకర్తలేనని,మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి రెడ్డిని గెలిపించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,కాంగ్రెస్ పార్టీ అభిమానులు,కార్యకర్తలు తరలివచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆడబిడ్డలు అని చూడకుండా పాల్వాయి స్రవంతి పై రాళ్ల దాడులకు పాల్పడుతున్నారని రేవంత్ మండపడ్డారు.కాంగ్రెస్ కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకుందామా ? తెలంగాణ అస్తిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే వదిలేద్దామా ? పార్టీ ఏ పాపం చేసిందని ఈ కుట్రలు చేస్తున్నారు అంటూ రేవంత్ ప్రశ్నించారు.తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు అంతా మునుగోడుకు తరలిరావాలని, ఇక్కడ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపునకు ఐక్యంగా కృషి చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు.ఈ విధంగా పార్టీ శ్రేణుల్లో కదలిక తీసుకువచ్చి మునుగోడు ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే వ్యూహానికి రేవంత్ తెర తీశారు.