Site icon HashtagU Telugu

Revanth Vs Harish : కొడంగల్‌ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్

Harish Revanth

Harish Revanth

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్​ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్‌ ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్‌ స్టేట్‌మెంట్‌ విన్నతర్వాత కేసీఆర్‌ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై హరీశ్‌ రావు అభ్యంతరం తెలిపారు. ‘అలాగైతే అమేథీలో రాహుల్ గాంధీని చెప్పుతో కొట్టినట్లే’ అని హరీశ్ బదులివ్వడంతో గందరగోళం తలెత్తింది. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్‌ చేశారు.

ఇక కృష్ణా జలాలపై కీలకమైన చర్చ జరిగేటప్పుడు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘కరీంనగర్ ప్రజలు తరిమితే ఆయన పాలమూరుకు వచ్చారు. కృష్ణా జలాల విషయంలో పాలమూరుకు అన్యాయం జరగడంపై చర్చ పెట్టాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తీర్మానానికి మద్దతు పలకకుండా ఫామ్ హౌస్లో దాక్కున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హరీశ్ రావును పంపించారు’ అని విమర్శించారు. ‘పదేళ్లు జరిగిన పాపాలకు కారణం కేసీఆరే. ఆయన పాపాలభైరవుడు. కృష్ణా జలాల్లో వాటాలను ఎవరు అమ్ముకున్నారు? ఎవరు చాపల పులుసుకు అలుసిచ్చారు? కేసీఆర్ను సభకు రమ్మనండి. ఎంత సమయం మాట్లాడతామంటే అంతసేపు మైక్ ఇస్తాం. మేము కూడా సమాధానం చెబుతాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ రెడ్డి కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కొడంగల్‌లో రేవంత్‌ను తరిమితే ఆయన మల్కాజిగిరికి వచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కంటే ఘాటుగా, దీటుగా తాను సమాధానం చెబుతానని అన్నారు. కేసీఆర్ జీవితంలో ఓటమి ఎరుగని నాయకుడన్నారు. గతంలో నల్లగొండలో కాంగ్రెస్ సీట్లు సున్నా అని.. బండ్లు ఓడలైతాయి.. ఓడలు బండ్లు అవుతాయని పేర్కొన్నారు.

నదీజలాల అంశం సుప్రీంకోర్టులో ఉందని, అది తేలేవరకు నీటి పంపకాలు జరగవని KCR అప్పట్లోనే స్పష్టం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ‘ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. పదేళ్లలో BRS ఎప్పుడూ కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రాజెక్టులను అప్పగించింది. ఆపరేషనల్ ప్రొటోకాల్కు ఒప్పుకోబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది’ అని హరీష్ రావు వివరించారు.

Read Also : AP Capital : రాజధాని విషయంలో మాట మార్చిన మంత్రి అంబటి