Site icon HashtagU Telugu

Revanth Reddy: ప్రియాంకతో భేటీకి ఢిల్లీకి రేవంత్?

Revanth Reddy

Revanth Reddy

కాబోయే తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో భేటీ కానున్నారు. హస్తిన కేంద్రంగా మునుగొడుపై చర్చించడానికి తెలంగాణ ప్రస్తుత ఇంచార్జి మనిక్ ఠాగూర్ , రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేసీ వేణుగోపాల్ సమావేశం అవుతారు. ఈ సమావేశం ముగిసిన తరువాత వారంతా ప్రియాంక గాంధీ వాద్రాను కలుస్తారు. మునుగోడులో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణాలతో పాటు, సమావేశం వివరాలను ఆమెకు అందజేస్తారు. కేసీఆర్, అమిత్ షా బహిరంగ సభలను ఆమె దృష్టికి తీసుకెళ్తారు. ప్రజా దీవెన, సమరభేరి సభలకు వచ్చిన స్పందనను అంచనా వేసి చెబుతారు. ప్రియాంక గాంధీతో బహిరంగ సభను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది.
ఉప ఎన్నిక స్థితిగతులపై చర్చించే సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గైర్హాజర్ కావొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. సోమవారం నుంచి ఆయన పాదయాత్ర చేపట్టనున్నందున ఈ భేటీకి హాజరయ్యే అవకాశాలు దాదాపుగా లేవని సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఈ సీటు ప్రిస్టేజియస్‌గా మారింది. ఈ స్థానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీపై ఉంది. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడాయన రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైంది.
దాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ హోరాహోరిగా పోరు మొదలు పెట్టాయి. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోయిన ప్రతిష్ఠను తిరిగిపొందడానికి మునుగోడు ఉప ఎన్నిక సరైన వేదికగా భావిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.