రేవంత్ ‘పాలిటిక్స్’ అదుర్స్..!

రాజ‌కీయ‌ల‌ను అనుకూలంగా మ‌లుచుకోవడంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. హుజురా‌రాబ్ ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రావ‌ని ఆయ‌న గ్ర‌హించాడు.

  • Written By:
  • Publish Date - November 1, 2021 / 10:00 PM IST

రాజ‌కీయ‌ల‌ను అనుకూలంగా మ‌లుచుకోవడంలో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారు. హుజురా‌రాబ్ ఎన్నిక‌ల్లో డిపాజిట్లు రావ‌ని ఆయ‌న గ్ర‌హించాడు. ఆ ఫ‌లితాల నుంచి క్యాడ‌ర్ మ‌న‌సును మ‌ర‌లించేందుకు రాహుల్‌, సోనియాలను రంగంలోకి దింపుతున్నాడు. డిసెంబ‌ర్ 9వ‌ తేదీన రాహుల్ గాంధీతో భారీ బ‌హిరంగ స‌భ పెట్ట‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అందుకోసం తెలంగాణ పోలీసుల‌ను అనుమ‌తి కోర‌తామ‌ని మీడియాకు లీకిచ్చేశాడు.

సోనియాగాంధీకి ఇచ్చిన మాట ప్ర‌కారం 30ల‌క్ష‌ల స‌భ్య‌త్వాల‌ను చేయాల‌ని క్యాడ‌ర్ ను రేవంత్ ఉత్సాహ ప‌రుస్తున్నాడు. టీఆర్ఎస్ , తెలుగుదేశం పార్టీ మాదిరిగా స‌భ్య‌త్వం తీసుకుంటే రూ. 2ల‌క్ష‌ల బీమా సౌక‌ర్యాన్ని క‌ల్పించాడు. ఈనెల 14వ తేదీ నుంచి జ‌న జాగ‌ర‌ణ యాత్ర‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నాడు. ఇదంతా చాలా వ్యూహాత్మ‌కంగా రేవంత్ రెడ్డి చేస్తోన్న రాజ‌కీయ క‌స‌రత్తు. హుజురాబాద్ ఫ‌లితాలు ఎలా ఉంటాయో..ముందుగానే గ్ర‌హించిన ఆయ‌న క్యాడ‌ర్ ను మ‌రో ఆలోచ‌న లేకుండా ముందుకు క‌దిలించే ప్ర‌య‌త్నానికి ప‌దును పెట్టాడు.

పీసీసీ చీఫ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ద‌ళిత‌, గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ స‌భ‌ల‌ను నిర్వ‌హించాడు. ఆ స‌భ‌ల‌తో పీసీసీ చీఫ్ గా త‌న స‌త్తా ఏమిటో పార్టీలో నిరూపించుకున్నాడు. సీనియ‌ర్లు సైతం ఆయ‌న స‌మావేశాల‌కు వ‌చ్చేలా జ‌నాన్ని కూడ‌గ‌ట్టాడు. స‌భ‌ల‌కు వ‌చ్చే జ‌నాన్ని చూసి వీహెచ్, జ‌గ్గారెడ్డి, వంశీచంద‌ర్ రెడ్డి..త‌దిత‌ర వ్య‌తిరేకులు సైతం డ‌యాస్ మీద క‌నిపించారు. దీంతో పీసీసీగా రేవంత్ ను నియ‌మించ‌డం చాలా ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యంగా ఏఐసీసీ బ‌లంగా విశ్వసించింది. బీసీ గ‌ర్జ‌న, జంగ్ సైర‌న్ అంటూ హ‌డావుడి చేశాడు రేవంత్. దీంతో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకే అనే స్థాయికి తీసుకెళ్లాడు. రెండు నెల‌లుగా ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాలు హుజురాబాద్ ఫలితాల‌తో తారుమారు కాబోతున్నాయి. ఆ ఫలితాల చుట్టూ రాబోయే రాజ‌కీయం తిర‌గ‌బోతోంది. ఆ విష‌యాన్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్ వేశాడు. జ‌న జాగ‌ర‌ణ‌, స‌భ‌త్వం, డిసెంబ‌ర్లో రాహుల్ స‌భ‌ల ద్వారా హుజురాబాద్ ఫలితాల‌ను మ‌రిపించాల‌ని యోచిస్తున్నాడు. ఆయ‌న వ్యూహం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూద్దాం..!