Revanth Reddy : మోడీ రాక్షసానందం కోసమే .. గాంధీ కుటుంబంపై ఈడీ దాడులు : రేవంత్

బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలనే దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - June 11, 2022 / 04:52 PM IST

బీజేపీ, టీఆర్ఎస్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందాలనే దురుద్దేశంతో ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణకు తెరతీశారని రేవంత్ ఆరోపించారు. ఈనెల 13న ఉదయం రాహుల్ గాంధీని ఈడీ విచారిస్తున్నంత సేపు దేశవ్యాప్తంగా అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ శ్రేణులు శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహిస్తాయని తెలిపారు. ఈక్రమంలోనే హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్ బాగ్ లో ఉన్న ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహిస్తాయని ప్రకటించారు. మోడీ, అమిత్ షా కలిసి గాంధీ కుటుంబం పై చేసిన కుట్రను వివరించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. శనివారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 15 రోజుల్లో 8 మంది మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరిగాయని గుర్తు చేశారు. బాధితులకు సత్వర న్యాయం చేయడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందన్నారు. పాలనతో పాటు రేపుల్లోనూ మజ్లిస్, టీఆర్ఎస్ లు పొత్తు పెట్టుకున్నాయని దుయ్యబట్టారు. జూబ్లీహిల్స్ బాలిక కేసులో మజ్లిస్ ఎమ్మెల్యే కొడుకు, వక్ఫ్ బోర్డు ఉన్నత స్థాయి వ్యక్తి సంబంధీకులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని విషయాలపై మాట్లాడే అసదుద్దీన్ ఒవైసీ .. జూబ్లీహిల్స్ బాలిక కేసుపై ఎందుకు నోరు విప్పడం లేదని రేవంత్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. “అత్తారింటికి దారేది” సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ను తలపించేలా తన జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సొంత డప్పు కొట్టుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రజలకు వివరించేందుకు మే 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని.. జూలై 7 వరకు పొడిగించామని తెలిపారు.